iPhone: చైనాలో ఆందోళనలు..60 లక్షల ‘ఐఫోన్‌ ప్రో’ యూనిట్ల కొరత!

చైనాలో కొవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఐఫోన్ తయారీ, సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Published : 29 Nov 2022 14:56 IST

వాషింగ్టన్‌: చైనాలో ఉన్న యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగడం లేదు. దీంతో ఈ ఏడాది ‘ఐఫోన్‌ ప్రో’ తయారీలో 60 లక్షల యూనిట్ల వరకు కోత పడే అవకాశం ఉందని యాపిల్‌ అంచనా వేస్తోంది. అనిశ్చితి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తయారీ అంచనాల్లో ఇంకా తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

కొవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల నుంచి కార్మికులు తిరిగి విధుల్లో చేరే వరకు తయారీలో అనిశ్చితి ఇలాగే ఉంటుందని యాపిల్‌ అంచనా వేస్తోంది. లాక్‌డౌన్‌లు కొనసాగినంత కాలం ఈ పరిస్థితి తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో యాపిల్‌ షేరు సోమవారం 2.6 శాతం కుంగి 144.22 డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాక్‌ విలువ 19 శాతం తగ్గింది. ఝెంగ్ఝౌలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో కరోనా ఆంక్షల కారణంగా అక్టోబరులో దాదాపు లక్ష మంది పారిపోయిన విషయం తెలిసిందే. కొత్తగా చేరినవారు సైతం సరైన వసతులు, వేతనం ఇవ్వడం లేదంటూ గతవారం ఆందోళనకు దిగారు.

ఈ ఏడాది గిరాకీ అధికంగా ఉన్న ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు అత్యధికంగా ఝెంగ్ఝౌలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లోనే తయారవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తయారీ అంచనాల్ని ఇటీవల యాపిల్‌ 90 మిలియన్‌ యూనిట్ల నుంచి 87 మిలియన్‌ యూనిట్లకు తగ్గించింది. గత రెండు వారాలుగా ఈ అంచనాలను సవరిస్తూ వస్తోంది. అమెరికాలో క్రిస్మస్‌ సందర్భంగా పెద్దఎత్తున విక్రయాలు జరుగుతాయి. మరోవైపు కొత్త సంవత్సరం వేళ ప్రపంచవ్యాప్తంగానూ గిరాకీ అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో తయారీలో ఇబ్బందులు తలెత్తడంపై యాపిల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని