Apple & Twitter: యాపిల్‌తో వివాదంపై ఎలాన్ మస్క్‌ క్లారిటీ!

ట్విటర్‌ను యాపిల్ తమ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు మస్క్‌ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. కానీ, ఆ వివాదం పరిష్కారమైందని తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించారు.

Updated : 01 Dec 2022 12:51 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌తో తలెత్తిన వివాదం సద్దుమణిగిందని ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. యాపిల్‌ స్టోర్‌ నుంచి ట్విటర్‌ను నుంచి తొలగించే యోచన తమకు లేదని ఆ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తనతో స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. బుధవారం యాపిల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి టిమ్‌ కుక్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఇరువురి మధ్య సుహృద్భావ సంభాషణలు జరిగినట్లు పేర్కొన్నారు. 

ట్విటర్‌కు యాపిల్‌ ప్రకటనలు నిలిపివేసిందని.. త్వరలో యాపిల్‌ స్టోర్‌ నుంచి ట్విటర్‌ యాప్‌ను తొలగిస్తామని కూడా హెచ్చరించినట్లు ఇటీవల మస్క్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. మస్క్‌ నేతృత్వంపై అనుమానంతోనే యాపిల్‌ ఈ దిశగా నిర్ణయం తీసుకుందంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో యాపిల్‌, ట్విటర్ మధ్య పోరు ప్రారంభమైందని అంతా భావించారు. కానీ, దానికి కొన్ని రోజుల్లోనే ముగింపు రావడం గమనార్హం. అయితే, తాజాగా యాప్‌ స్టోర్‌లో ట్విటర్‌ను కొనసాగించడంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ప్రకటనల సంగతేంటనే విషయాన్ని మాత్రం మస్క్‌ వెల్లడించలేదు. ఆయన ఆరోపించినట్లుగా యాపిల్‌ నిజంగానే ట్విటర్‌కు ప్రకటనలు ఇవ్వడం ఆపేసిందా.. లేదా.. అనే విషయంపై అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మస్క్‌ ఆరోపణలపై యాపిల్‌ ఎక్కడా ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని