iPhone 14: త్వరలో ‘మేడిన్‌ ఇండియా’ ఐఫోన్‌ 14.. భారత్‌లో తయారీ ప్రారంభించనున్న యాపిల్‌

అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌-14ను భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించింది....

Published : 26 Sep 2022 11:57 IST

దిల్లీ: అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌-14ను భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చైనా తర్వాత అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణిగా ఉన్న భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో చైనా నుంచి కొంత మేర ఐఫోన్ల తయారీని వేరే ప్రాంతాలకు మళ్లించాలని చూస్తుండడం కూడా మరో కారణం.

ఐఫోన్‌-ఎస్‌ఈతో భారత్‌లో తమ తయారీ కార్యకలాపాలను యాపిల్ 2017లో ప్రారంభించింది. ప్రస్తుతం ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13ను దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఐఫోన్‌-14 కూడా ఆ జాబితాలో చేరనుంది. మరికొన్ని రోజుల్లోనే ‘మేడిన్‌ ఇన్‌ ఇండియా’ ఐఫోన్‌ 14 స్థానిక వినియోగదారుల చేతుల్లోకి చేరుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. చెన్నై శివార్లలో ఉన్న ఫాక్స్‌కాన్‌ తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరా చేయనున్నారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన యాపిల్‌ ఉత్పత్తులకు దేశంలో మంచి ఆదరణ ఉంది. సెప్టెంబరులో 2020లో దేశంలో తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. త్వరలో యాపిల్‌ రిటైల్‌ కేంద్రాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జూన్‌ 2022తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఆదాయం రెండింతలు కావడం విశేషం. మరోవైపు 2025 కల్లా విక్రయించే ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి (25 శాతం) భారత్‌లో తయారయ్యే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు ఇటీవల అంచనా వేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని