గృహ రుణం కోసం దర‌ఖాస్తు చేస్తున్నారా?ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకోండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటి కొనుగోలు అనేది కేవలం ఆస్తిని కొనుగోలు చేయ‌డం కాదు. ఇది భావోద్వేగ‌భ‌రిత నిర్ణ‌యం. స‌రైన ప్ర‌ణాళిక ఉండాలి. నిధుల కోసం బ్యాంకులు అందించే గృహ రుణాన్ని ఆశ్ర‌యించొచ్చు. అయితే చెల్లింపుల విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా మొత్తం ఇంటినే కోల్పోవ‌ల‌సిన ప‌రిస్థితులు రావ‌చ్చు. ఈ మ‌ధ్య బ్యాంకులు త‌ర‌చూ ఈ-వేలం ద్వారా ఇళ్ల‌ను వేలం వేస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. రుణం తీసుకుని తిరిగి చెల్లింపులు చేయ‌లేక‌పోయిన వారి ఇళ్ల‌ను.. బ్యాంకులు వేలం ద్వారా విక్ర‌యించి త‌మ బ‌కాయిల‌ను రాబ‌ట్టుకుంటాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ద‌ర‌ఖాస్తు చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి చివ‌రి ఈఎంఐ చెల్లించేంత వ‌ర‌కు ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ప‌రిశోధ‌న చేయాలి. గృహ రుణ విష‌యంలో చేసే త‌ప్పులు తెలుసుకోవాలి. అప్పుడే మీరు జాగ్ర‌త్త ప‌డొచ్చు.

ప‌రిశోధ‌న: గృహ రుణాల‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వివిధ ఆర్థిక సంస్థ‌లు, రుణ గ్ర‌హీత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు క‌స్ట‌మైజ్డ్ ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. రుణం కోసం బ్యాంకును ఎంచుకునే ముందు స‌రైన పరిశోధ‌న చేయాలి. ఎంత మొత్తం రుణం కావాలి? వ‌డ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, అనువైన చెల్లింపుల విధానం, ఛార్జీలు, ఇత‌ర నియ‌మ నిబంధ‌నల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ త‌ర్వాత మాత్ర‌మే రుణం కోసం ప్ర‌య‌త్నించాలి. ప్ర‌స్తుతం వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న గృహ రుణాల‌ను పోల్చి చూసేందుకు ప‌లు ర‌కాల వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పోల్చి చూడొచ్చు. స‌రైన రీసెర్చ్ లేక‌పోతే అన‌వ‌స‌ర‌మైన‌ కార‌ణాల‌తో ఎక్కువ ఛార్జీలు, ఈఎంఐ చెల్లించాల్సి రావ‌చ్చు. కాబ‌ట్టి ముందే స‌మాచారాన్ని సేక‌రించి, అనువైన బ్యాంకులో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే మంచి ఫ‌లితాలు పొందొచ్చు.

క్రెడిట్ స్కోరు ముఖ్యం: ఏ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా... బ్యాంకులు మొద‌టిగా చూసేది క్రెడిట్ స్కోరునే. క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ రిపోర్టులు అందిస్తాయి. వీటిని సుల‌భంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మంచి క్రెడిట్ స్కోరు అంటే 750 లేదా అంత‌కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే వినియోగ‌దారుల‌కు అనుకూలంగా రుణాలు ల‌భిస్తాయి. మంచి బ్యాంకును ఎంపిక చేసుకునే వీలుంటుంది. క్రెడిట్ స్కోరు/చెల్లింపుల చ‌రిత్ర‌లో లోపాలు ఉంటే గృహ‌రుణం త్వ‌ర‌గా ల‌భించ‌దు. వడ్డీ రేట్లు, ఛార్జీలు ప‌డే అవ‌కాశం ఎక్కువుంటుంది. కాబ‌ట్టి మీకు త‌క్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే.. ముందుగా దీన్ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపుల‌ను స‌కాలంలో చేస్తే క్రెడిట్ స్కోరు పెరుగుతుంది.

రుణ వ్య‌వ‌ధి: సాధార‌ణంగా గృహ రుణాలు 10 నుంచి 30 సంత్స‌రాల కాల‌ప‌రిమితితో వ‌స్తాయి. అందువ‌ల్లే వీటిని దీర్ఘ‌కాలిక రుణాలు అంటారు. ఎంత కాల‌ప‌రిమితి ఎంచుకోవాలనేది వ్య‌క్తి వ‌య‌సు, క్రెడిట్ చ‌రిత్ర‌, చెల్లింపుల సామ‌ర్థ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. వీలైనంత త్వ‌ర‌గా రుణం చెల్లించాలనే ఉద్దేశంతో ఎక్కువ ఈఎంఐ మొత్తం ఎంచుకుంటుంటారు. అయితే ఒక్కోసారి స‌రైన స‌మ‌యానికి ఈఎంఐ చెల్లించ‌లేక ఇబ్బందులు ప‌డొచ్చు. త‌క్కువ మొత్తంలో ఈఎమ్ఐలు ఎంచుకుని ఎక్కువ కాలంపాటు గృహ రుణాన్ని కొన‌సాగిస్తే, వ‌డ్డీలు ఎక్కువ చెల్లించాల్సి రావ‌చ్చు. అందువ‌ల్ల మీ ప్రస్తుత ఆదాయం, ఖ‌ర్చులు, పెట్టుబ‌డులు, పొదుపు అన్నింటినీ లెక్కించి నెల‌వారిగా చెల్లించే ఈఎంఐలు నిర్ణ‌యించాలి. మీ ప్ర‌స్తుత జీవ‌న శైలి, పెట్టుబ‌డులు ప్ర‌భావితం కాకుండా చూసుకోవ‌డ‌మూ ముఖ్య‌మే.

ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేయడం: చెల్లింపుల సామ‌ర్థ్యాన్ని లెక్కించేట‌ప్పుడు చాలామంది వారి నెల‌వారీ ఖ‌ర్చుల‌ను లెక్క‌లోకి తీసుకోరు. ఒక‌వేళ మీ నెల‌వారీ ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉండి, ఈఎంఐ కూడా ఎక్కువ‌గా ఉంటే.. భ‌విష్య‌త్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం ఆదాయంలో అన్ని రుణాల‌కు సంబంధించిన‌ ఈఎంఐలు క‌లిపి 30 నుంచి 35 శాతం వ‌ర‌కు ఉండేలా చూసుకోవాలి. ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి అనుస‌రించి మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాలి. భ‌విష్య‌త్‌లో ఇంక్రిమెంట్ వ‌స్తుంది.. జీతం పెరుగుతుంద‌ని భావించి అధిక రుణం కోసం ప్ర‌య‌త్నించ‌డం గానీ, ఎక్కువ ఈఎంఐలు ఎంచుకోవ‌డం గానీ చేయ‌కూడ‌దు. భ‌విష్య‌త్‌లో జీతం పెర‌గొచ్చు. అయితే ద్ర‌వ్యోల్బణ ప్రభావంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంద‌ని గుర్తుంచుకోండి.

గృహ రుణ బీమా: గృహ రుణం తీసుకున్న వారు గృహ రుణ బీమాను కూడా తీసుకోవాలి. రుణం తీసుకున్న వ్య‌క్తి అనుకోకుండా మ‌ర‌ణిస్తే, వారి స‌హ రుణ ద‌ర‌ఖాస్తు దారుడు గానీ, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సులు గానీ గృహ రుణం చెల్లించాల్సిందే. మీరులేన‌ప్పుడు భ‌విష్య‌త్‌ ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ స‌భ్యులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు త‌గిన గృహ బీమాను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఈ మొత్తాన్ని జీవిత బీమా పాలసీలో కూడా కలిపి అధిక బీమా తీసుకోవచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని