Small finance banks: స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో డిపాజిట్లు శ్రేయస్కరమేనా?

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో డిపాజిట్లకు రిస్క్‌ ఉంటుందా? ఎంత పరిమితి వరకు డిపాజిట్‌ చేయొచ్చో ఇక్కడ చూడండి.

Published : 28 Mar 2023 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపోరేట్ల పెంపు అనంతరం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ప్రస్తుతం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 9.50% వరకు వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, అధిక వడ్డీ కోసం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో (Small finance banks) ఎఫ్‌డీలు చేయొచ్చా? డిపాజిట్లు చేయడం శ్రేయస్కరమేనా?

ఆర్‌బీఐ నియంత్రణ

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కూడా ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటాయి. ఇవి కూడా పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు, ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకుల్లానే షెడ్యూల్డ్‌ బ్యాంకులుగా ఆర్బీఐ వర్గీకరించింది. అయితే, కొంత అదనపు రాబడి (వడ్డీ) పొందడానికి భద్రత విషయంలో రాజీ పడకూడదు. మీ డిపాజట్‌ చాలా ఏళ్ల కష్టార్జితం అని గుర్తించాలి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆర్థిక పరిస్థితి, స్థిరత్వాన్ని అంచనా వేయాలి. మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని నిర్ధారించుకోవడానికి బ్యాంకు విశ్వసనీయత, ఖ్యాతిని పరిశోధించాలి. పెట్టుబడి పెట్టే ముందు రిస్క్‌ స్థాయిని అంచనా వేయడానికి బ్యాంకు క్రెడిట్‌ రేటింగ్‌ను తప్పనిసరిగా చూడాలి.

డిపాజిట్‌ ఎంత?

అన్ని బ్యాంకుల లాగానే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) రక్షణ ఉంటుంది. మీరు ఈ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే, వడ్డీతో కలిపి రూ.5 లక్షల్లోపు మొత్తం ఉండేలా జాగ్రత్త పడాలి. డిపాజిట్‌ పరిధి రూ.5 లక్షలలోపు ఉంటేనే మీరు పూర్తి ఆర్థిక రక్షణలో ఉన్నట్లుగా భావించాలి. అధిక మొత్తాన్ని డిపాజిట్‌ చేసేటప్పుడు ప్రముఖ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఒకటి కాదని గుర్తించాలి. పెరుగుతున్న వడ్డీ రేట్లపై ఆశతో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో అధిక మొత్తంలో డిపాజిట్‌ చేయకపోవడం మంచిది.

ఉపసంహరణ

మీ ఎఫ్‌డీని మధ్యలో బ్రేక్ చేయగలరా లేక లాక్ ఇన్ ఉంటుందా అనేది చూసుకోవడం మేలు. మెచ్యూరిటీ తేదీకి ముందు ఎఫ్‌డీని ఉపసంహరించుకుంటే వర్తించే పెనాల్టీ ఛార్జీలు ఉంటాయని గమనించాలి.

చివరిగా: ఎఫ్‌డీలు వేసేటప్పుడు కేవలం వడ్డీనే ప్రామాణికంగా తీసుకోకూడదు. ప్రముఖ బ్యాంకుల ఎఫ్‌డీలు సురక్షితం అని భావించాలి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో తక్కువ స్థాయిలోనే ఎఫ్‌డీలు చేయడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని