Gen Z Investments: మీరు ‘జెన్‌-జీ’నా? భవిష్యత్తు ఆర్థిక భరోసాకు మార్గాలివే!

మీరు 1997-2012 మధ్య పుట్టిన జెన్‌-జీ తరానికి చెందినవారైతే మీ పెట్టుబడి ప్రణాళిక చాలా భిన్నంగా ఉండాలి. పాతతరం వారి పెట్టుబడి మార్గాలతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. 

Updated : 03 Oct 2022 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు జనరేషన్‌ జెడ్‌- ‘జెన్‌ జీ’ (1997-2012 మధ్య జన్మించినవారు)కు చెందినవారా? పెట్టుబడులను ఎలా వర్గీకరించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీ కంటే ముందు తరం అంటే మీ తల్లిదండ్రుల పెట్టుబడి మార్గాన్ని మీరు అనుసరించాల్సిన అవసరం లేదు! ఎందుకంటే అప్పటి ధరలు, సామాజిక-రాజకీయ పరిస్థితులు, పెట్టుబడి మార్గాలు, ఉపాధి అవకాశాలు.. చాలా భిన్నంగా ఉండేవి. సగటున 7.75 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 1960లో రూ.100 ఇప్పుడు దాదాపు రూ.8,800తో సమానం. అందుకే అప్పటి వారి పెట్టుబడుల తీరుని ఇప్పటికీ అవలంబిస్తే ఉపయోగం ఉండదు. అందుకే జెన్‌-జీ తరం వారు వారి పెట్టుబడుల పోర్ట్‌పోలియోను భిన్నంగా ప్లాన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

  • భవిష్యత్తు కోసం పటిష్ఠ ప్రణాళికలు రచిస్తూ.. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడుతుందో తెలియదు. అందుకే అత్యవసర నిధిని కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా డబ్బును జమ చేసుకోవాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, లిక్విడ్‌ ఫండ్లు అందుకు సరైన పెట్టుబడి మార్గాలనీ నిపుణులు సూచిస్తున్నారు.
  • ఎలాంటి అప్పులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా తీసుకున్నా.. వాటిని తీర్చడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే అప్పులు కుప్పలా పేరుకుపోయి మీ పూర్తి ఆర్థిక ప్రణాళికల్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఇబ్బందుల్లో చిక్కుకొని మీ లక్ష్యాల సాధనలో తడబాటుకు గురికావాల్సి వస్తుంది.
  • రిటైర్మెంట్‌ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదనుకోవడం చాలా పెద్ద తప్పు! చాలా మంది పదవీ విరమణ జీవితం గురించి 40 ఏళ్ల వయసొచ్చిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటుంటారు. కానీ, అది పొరపాటు. రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ ఎంత త్వరగా ప్రారంభిస్తే.. మీ మలిదశ జీవితానికి అంత భరోసా లభిస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం వీలైనంత త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించి రిటైర్‌ అవ్వాలనుకుంటున్నారు. మీ లక్ష్యం కూడా అదే అయితే, వెంటనే మదుపు చేయడం ప్రారంభించండి.
  • తోచిన దాంట్లో మదుపు చేస్తూ వెళ్తే మీ లక్ష్యాలను చేరుకునే మార్గం క్లిష్టంగా మారుతుంది. అందుకే మీ పెట్టుబడులు ఎప్పుడూ మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. మీ లక్ష్యాలను స్వల్ప (10 ఏళ్లు), మధ్య (10-20 ఏళ్లు), దీర్ఘకాలిక (20 ఏళ్ల పైన).. ఇలా మూడు వర్గాల కింద విభజించుకోండి. ఇలా ప్రతి లక్ష్యానికి సరిపడా మదుపు మార్గాన్ని ఎంచుకొని వాటిలో పెట్టుబడి పెట్టండి.
  • దేంట్లో పెట్టుబడి పెట్టినా దాన్ని స్థిరంగా కొనసాగించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు సిప్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఒక్క వాయిదాను కూడా ఎగవేయకుండా చెల్లించాలి. అప్పుడే మీరు డబ్బుకు ఉండే కాంపౌండింగ్‌ విలువను పొందగలుగుతారు. దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున సంపదను సృష్టించుకోగలుగుతారు. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్‌ బఫెట్‌ ఏమన్నారంటే.. ‘సంపదను సృష్టించాలంటే ఇతరుల కంటే తెలివిగా ఉండకపోయినా పరవాలేదు. కానీ, కచ్చితంగా వారి కంటే క్రమశిక్షణగా మాత్రం ఉండాలి’ అన్నారు.
  • మీ పెట్టుబడుల ప్రయాణంలో మరో ముఖ్యమైన విషయం వివిధీకరణ (Diversification). అంటే మీరు చేసే మదుపు ఏ ఒక్క పథకంలోనో లేక ఏ ఒక్క మార్గంలోనో ఉండొద్దు. వాటిని వివిధ వర్గాల కిందకు విభజించుకోవాలి. స్టాక్స్‌, బంగారం, బాండ్లు, ఎన్‌పీఎస్‌... ఇలా వివిధ మార్గాలకు మళ్లించాలి. అప్పుడే మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఉదాహరణకు మీరు పూర్తి డబ్బుని స్టాక్స్‌లోనే పెట్టారనుకుందాం. ఒకవేళ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ ఇవ్వకపోయినా.. లేక మార్కెట్లు కుప్పకూలినా నష్టపోవాల్సి వస్తుంది. మీ పెట్టుబడుల్ని వివిధీకరించుకోగలిగితే.. ఒక దాంట్లో వచ్చే నష్టాల్ని మరో దాంట్లో వచ్చే లాభాలతో పూడ్చుకోవచ్చు. స్టాక్స్‌లోనూ ఏదో ఒక్క కంపెనీ షేర్లలోనో లేక ఒక థీమ్‌లోనో కాకుండా వివిధ మార్గాల కిందకు వర్గీకరించుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని