Updated : 12 Apr 2022 12:06 IST

Investment: పెట్టుబడి కోసం ఇల్లు కొంటున్నారా? ఈ రిస్కులుంటాయి తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబడి పెట్టడానికి చాలా మంది స్థిరాస్తి వైపు మొగ్గుచూపుతుంటారు. కొందరు భూమిపై మదుపు చేస్తే మరికొందరు ఇళ్లను కొని మంచి ధర వచ్చినప్పుడు అమ్మేస్తుంటారు. కరోనా సంక్షోభం నుంచి క్రమంగా బయటపడుతున్న నేపథ్యంలో మరోసారి స్థిరాస్తి రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. భూమి విషయం పక్కనపెడితే.. పెట్టుబడి కోసం ఇల్లు కొనేవారు మాత్రం అందులో ఉండే లాభనష్టాల్ని దృష్టిలో ఉంచుకోవాలి.

స్థిరాస్తికి ఎంత కేటాయించాలి..

పెట్టుబడి పెట్టడానికి స్టాక్స్‌, బంగారం, బాండ్లు.. ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. దీంట్లో స్థిరాస్తి ఒకటి. అయితే, చాలా మందికి మిగిలిన వాటిపై పెద్దగా అవగాహన ఉండదు. తమ వద్ద ఉన్న డబ్బునంతా స్థిరాస్తిలో పెట్టేస్తుంటారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఈ రంగం కుదేలైతే.. మీకు కావాల్సిన డబ్బులు చేతికందకపోవచ్చు. పైగా విలువ పడిపోతే.. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక నిపుణుల ప్రకారం.. మీ మొత్తం పెట్టుబడిలో కేవలం 20-25 శాతం మాత్రమే స్థిరాస్తికి కేటాయించాలి.

ఎంత త్వరగా డబ్బుగా మార్చుకోవచ్చు..

సాధారణంగా ఒక నిర్దిష్ట లక్ష్యంతో మనం దేంట్లోనైనా పెట్టుబడి పెడుతుంటాం. దానికి ఓ కాలపరిమితినీ నిర్ణయించుకుంటాం. మీ దగ్గర అపార్ట్‌మెంట్‌, ఇల్లు, భూమి వంటి ఏదో ఒక స్థిరాస్తి ఉందనుకుందాం. మీరనుకున్న కాలపరిమితిలో ఆ ఆస్తి మీరు ఆశించినంత మొత్తాన్ని అందించలేకపోవచ్చు. కొన్ని సార్లు మన లక్ష్యం కంటే చాలా తక్కువ ధర పలకొచ్చు. అలాంటప్పుడు కచ్చితంగా ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. లేదంటే మీ లక్ష్యంపై ప్రభావం పడి అది మీ మొత్తం ఆర్థిక ప్రణాళికనే తలకిందులు చేసే అవకాశం ఉంది.

పాతబడినా కొద్దీ..

ఒకప్పుడు 15-20 ఏళ్ల ఇళ్లు, భవనాలకైనా మంచి గిరాకీ ఉండేది. కానీ, ఇప్పుడలా కాదు. పరిస్థితులు మారిపోయాయి. ఎంత పేరున్న సంస్థ నిర్మించినా సరే..  గడవు పెరుగుతున్న కొద్దీ గిరాకీ తగ్గిపోతుంటుంది. ఉదాహరణకు 10 ఏళ్ల క్రితం కట్టిన ఇంటితో పోలిస్తే.. సౌకర్యాలు, వసతులు, డిజైన్‌ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి 10-15 ఏళ్ల ఇల్లు మంచి నాణ్యతతో ఉన్నప్పటికీ.. కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ చుట్టుపక్కల కొత్త నిర్మాణాలు భారీగా ఉంటే ఇంకా ప్రమాదం.

కనిపించని ఖర్చులు..

పైన తెలిపిన రిస్క్‌లన్నింటినీ అధిగమించి ఇల్లు కొన్నప్పటికీ.. తెలియని, కనిపించని ఖర్చులు మాత్రం తప్పకుండా రిస్క్‌గా మారతాయి. పన్నులు, సొసైటీ నిర్వహణ వ్యయం, పునరుద్ధరణ ఖర్చులు, బ్రోకరేజీలు, అద్దెకు సంబంధించిన రిస్కులు ఉంటాయి. కొత్తవారు అద్దెకు వచ్చిన ప్రతిసారీ ఏజెంట్లకు బ్రోకరేజీ చెల్లించాల్సి రావొచ్చు. అలాగే కనీసం ఐదేళ్లకొకసారైనా ఆధునికీకరణ పనులు చేయించాల్సి ఉంటుంది. లేదంటే ఇల్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ తరుణంలో అద్దెలను ఏటా పెంచడానికి వీలు లేకుండా పోయింది. ఇలాంటి కనిపించని ఖర్చులన్నీ మన లక్ష్యానికి గండికొట్టే అవకాశం ఉంది. రాబడిని అంచనా వేసేటప్పుడు చాలా మంది వీటిని పరిగణనలోకి తీసుకోరు.

కాబట్టి పెట్టుబడి కోసం ఇంటిని కొనేటప్పుడు పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాబడిని అంచనా వేయాలి. అప్పుడే మీరనుకున్న లక్ష్యాన్ని అనుకున్న గడువులోగా చేరతారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని