Income Tax: కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?

ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

Updated : 05 Jul 2024 09:46 IST

గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరారా? కొత్తగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయబోతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే..

దాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీరు పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వచ్చారా? మీ సంస్థ మీ వేతనం నుంచి టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) చేసిందా చూసుకోండి. ఆ తర్వాతే మీరు రిటర్నులు దాఖలు చేయాలా, వద్దా అనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది.

అర్థం చేసుకోండి..

గత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్‌ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకూ ఆర్జించిన ఆదాయానికి ఇప్పుడు రిటర్నులు దాఖలు చేస్తున్నామన్న సంగతిని గుర్తుంచుకోండి. ఆదాయం అంటే కేవలం వేతనం ఒక్కటే కాదు. వడ్డీ ద్వారా వచ్చిన మొత్తం, ఇంటి అద్దెలు, ఇతరత్రా మీకు వచ్చిన ప్రతి రూపాయీ మీ ఆదాయంలో భాగంగానే చూపించాల్సి ఉంటుంది. ఆదాయం వచ్చినా, దాన్ని చూపించకపోతే, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది.

పత్రాలు సేకరించండి..

ముందుగా పన్ను దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలనూ సిద్ధం చేసుకోండి.  పాన్, ఫారం-16, బ్యాంకు ఖాతా వివరాలు (వడ్డీ కోసం), మీరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు (పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌), టీడీఎస్‌ సర్టిఫికెట్, ఫారం-26ఏఎస్‌లాంటివన్నీ సేకరించి పెట్టుకోండి. 

రిజిస్ట్రేషన్‌ చేసుకోండి...

కొత్తగా రిటర్నులు దాఖలు చేసే వారు ముందుగా ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో రిజిష్టర్‌ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో అడిగిన వివరాలు ఇవ్వాలి. పాన్, మీ పేరు, చిరునామా, ఇ-మెయిల్, ఫోన్‌ నంబరులాంటివి అందించాల్సి ఉంటుంది. ఓటీపీలతో వీటిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్‌వర్డ్‌ పెట్టుకొని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాతే రిటర్నులు దాఖలు చేసేందుకు వీలవుతుంది.

ధ్రువీకరించుకోండి..

సంస్థ నుంచి ఫారం-16 అందుతుంది. దీనిని ఫారం-26ఏఎస్‌తో పోల్చి చూసుకోవాలి. మీరు ఇచ్చిన అన్ని మినహాయింపు వివరాలు ఫారం-16లో నమోదయ్యాయా చూసుకోండి. ఇందులో పేర్కొన్న టీడీఎస్‌ వివరాలు ఫారం-26ఏఎస్‌తో సరిపోవాలి. అప్పుడే మీరు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలవుతుంది.

మినహాయింపులు జాగ్రత్తగా..

ఆదాయపు పన్ను మినహాయింపులు పొందేందుకు మీరు పెట్టిన పెట్టుబడి వివరాలన్నీ జాగ్రత్తగా నమోదు చేయండి. సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో జమ చేసిన మొత్తానికి రూ.50,000 వరకూ క్లెయిం చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది. దీంతోపాటు గృహరుణం ఉన్నప్పుడు దానికి చెల్లించిన వడ్డీకి రూ.2లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. పొదుపు ఖాతా మీద వచ్చిన వడ్డీకి రూ.10వేల వరకూ సెక్షన్‌ 80టీటీఏ కింద మినహాయింపు లభిస్తుంది. ఇవన్నీ సరిగ్గా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ రిటర్నులు కచ్చితంగా దాఖలు చేసినట్లు.

గడువులోపే..

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సాధారణంగా జులై 31 చివరి రోజు. కొన్ని అనుకోని పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ గడువును పొడిగిస్తుంది. డిసెంబరు వరకూ అపరాధ రుసుముతోనూ రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుంటుంది. సాధ్యమైనంత వరకూ ఈ నెలాఖరులోగా రిటర్నులు దాఖలు చేయడం ఎప్పుడూ మంచిది. ఆలస్యంగా దాఖలు చేస్తే దీర్ఘకాలిక లాభనష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోతారు.

భద్రంగా ఉంచుకోండి..

ఫారం-16తోపాటు, ఫారం-26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌), మీరు రిటర్నులు దాఖలు చేసిన పత్రాలన్నింటినీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. డిజిటల్‌ రూపంలోనే ఉంటే.. అన్నీ ఒక చోట దాచిపెట్టుకోండి. వీలైనప్పుడు ఇవన్నీ మీకు అందుబాటులో ఉండాలి. ఏదైనా రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు కనీసం రెండు మూడేళ్ల ఫారం-16తోపాటు, రిటర్నులు దాఖలు చేసిన ఆధారాలు అడుగుతారు. కాబట్టి, మీరు పన్ను చెల్లించకపోయినా, మీకు వచ్చిన ఆదాయం మేరకు రిటర్నులు దాఖలు చేయడం ఎప్పుడూ ఉత్తమం. రిటర్నులను సమర్పించడం అంటే కేవలం చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేయడంగానే భావించకూడదు. మీ ఆర్థిక క్రమశిక్షణకూ ఇది ఒక గుర్తింపునిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని