Home Loan: ఇల్లు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా..?

ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంకు రుణాల గురించే కాకుండా రుణంపై లభించే పన్ను ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి లభించే సబ్సిడీల గురించి తెలుసుకోవాలి.

Published : 21 Feb 2023 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతంగా ఇంటిని కలిగి ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఇల్లు కొనడం అంత సులభం కాదు. అందుకు చాలా నగదు అవసరం అవుతుంది. అయితే బ్యాంకులు అర్హత ఉన్నవారికి విరివిగానే గృహ రుణాలను (Home Loans) అందిస్తున్నాయి. రుణం తీసుకున్నప్పుడు.. వడ్డీ రేట్లు, వివిధ ఆర్థిక సంస్థల నిబంధనలు, షరతులను సరిపోల్చాలి. ఇంటి రుణం పొందుతున్నప్పుడు వాటిపై ఆఫర్‌లు, పన్ను ప్రయోజనాలను కూడా పోల్చడం చాలా కీలకం.

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం ఆర్థిక సంవత్సరంలో నివసించడం కోసం ఇంటిని కొనుగోలు చేస్తే, ఇంటి రుణం వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం ఉంటుంది. సెక్షన్‌ 80సి ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు అసలు మొత్తంపై పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది వ్యక్తులు తమ సొంత ఇంటిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అసలుపై పన్ను మినహాయింపుతో పాటు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు అందిస్తోంది.

ఈఎంఐ చెల్లింపులు

గృహ రుణం తీసుకున్నప్పుడు, దాన్ని వడ్డీతో సకాలంలో చెల్లించాలి. రుణ చెల్లింపుల సౌలభ్యం కోసం.. రుణ మొత్తం, వడ్డీతో పాటు సమానమైన నెలవారీ వాయిదా (ఈఎంఐ)లో విభజిస్తారు. ఇంటి రుణం పొందే ప్లాన్‌ చేస్తున్నప్పుడు.. ఈఎంఐలను సకాలంలో చెల్లించడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. ఈఎంఐలను తిరిగి చెల్లించడానికి మందుస్తు ప్రణాళిక ఉంటే, ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. మిగులు ఆదాయాన్ని బట్టి ప్రీ-పేమెంట్‌ కోసం కూడా ప్లాన్‌ చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ముందస్తుగా చెల్లింపులు చేసి ఈఎంఐలు పెరగకుండా చూసుకోవచ్చు.

అర్హత

ఇంటి రుణం తీసుకునేవారు తిరిగి చెల్లించే ఈఎంఐ సామర్థ్యాన్ని బట్టి రుణ మొత్తాన్ని ఎంచుకోవాలి. బ్యాంకులు మీ టేక్‌-హోమ్‌ జీతంలో 40% వరకు ఈఎంఐలుగా ఉండడానికి బ్యాంకులు అనుమతిస్తాయి. అర్హతలేని అధిక మొత్తానికి రుణ దరఖాస్తు చేస్తే, బ్యాంకులు తిరస్కరిస్తాయి. కాబట్టి, ఎవరైనా వారి రుణ అర్హతను ముందుగానే తెలుసుకోవాలి. ఆ తర్వాత డౌన్‌పేమెంట్‌ కోసం డబ్బును ఏర్పాటు చేసుకోవడం సులభం అవుతుంది. మొత్తం ఆస్తి విలువలో 20% డౌన్‌ పేమెంట్‌గా చెల్లిస్తే ఈఎంఐ తగ్గుతుంది.

స‌హ‌-ద‌ర‌ఖాస్తుదారునితో ప్రయోజనం

ద‌ర‌ఖాస్తుదారునికి త‌క్కువ క్రెడిట్ స్కోర్‌, త‌గినంత ఆదాయం లేక‌పోవ‌డం, మొద‌లైన వాటి కార‌ణంగా చాలా గృహ రుణాల ద‌ర‌ఖాస్తులను బ్యాంకులు తిరస్కరిస్తాయి. అటువంటి రుణగ్రహీతలు స‌హ‌-ద‌ర‌ఖాస్తుదారుని చేర్చుకోవ‌డం ద్వారా వారి రుణ అర్హత అవ‌కాశాల‌ను మెరుగుప‌ర్చుకోవ‌చ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న భార్యను గానీ, కుటుంబ స‌భ్యుల్లో ఉన్న మ‌హిళ‌ను గానీ స‌హ‌-ద‌ర‌ఖాస్తుదారునిగా చేర్చుకోవ‌డం వ‌ల్ల రుణం వేగంగా మంజూరు అవ్వడమే కాకుండా, మ‌హిళ‌ల‌కిచ్చే 0.05% వ‌డ్డీ రేటు రాయితీని కూడా బ్యాంకుల ద్వారా పొందొచ్చు. సహ-దరఖాస్తుదారుడి ఆదాయం కూడా కలవడం వల్ల ఎక్కువ రుణం తీసుకోవచ్చు. ఈఎంఐ చెల్లింపు కూడా సులభంగానే ఉంటుంది.

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (PMAY)

మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(PMAY) అర్హులైన గృహ కొనుగోలుదారులకు గృహరుణ సబ్సిడీని అందిస్తోంది. పట్టణ మధ్యతరగతి ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు రూ.9 లక్షల వరకు గృహరుణం తీసుకుంటే.. చెల్లించే వడ్డీపై 4% వరకు సబ్సిడీని పొందొచ్చు. అలాగే, రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.12 లక్షల వరకు గృహరుణం తీసుకుంటే, చెల్లించే వడ్డీపై 3% వరకు సబ్సిడీని పొందొచ్చు. ఈ పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా కొంతవరకు భారాన్ని తగ్గించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు