ప‌న్నును ఆదా చేయ‌డం కోస‌మే బీమా కొనుగోలు చేస్తున్నారా?

జీవిత బీమాను కొనుగోలు చేసే ముందు అన్ని బీమా పాల‌సీల‌లో బీమా ర‌క్ష‌ణ స‌మానంగా ఉండ‌ద‌ని తెలుసుకోవాలి.

Updated : 23 May 2022 12:38 IST

జీవిత బీమా అనేది రాబ‌డి పొందే సాధ‌నం కాదు. జీవితంలో అనుకోని సంఘ‌ట‌నలు జ‌రిగిన‌ప్పుడు, ఆధార‌ప‌డ్డ కుటుంబం ఆర్ధికంగా ర‌క్షింప‌బ‌డ‌డానికి రూపొందించబడింది. జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేసేటప్పుడు బీమా క‌వ‌ర్ ప‌రిమాణం, పాల‌సీ స‌రెండ‌ర్ విలువ‌, ప్రీమియం చెల్లింపు విధానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. `జీవిత బీమా` అనే ప‌దం వివిధ ర‌కాల పాల‌సీల‌కు ఉప‌యోగించే విస్తృత ప‌దం. చాలా మంది ప‌న్ను చెల్లింపుదారులు ఒక‌టి కంటే ఎక్కువ బీమా పాల‌సీల‌ను క‌లిగి ఉంటారు. కానీ వారిలో ఎక్కువ మంది ప‌న్ను ఆదా చేయ‌డం కోసం మాత్రమే బీమాను కొనుగోలు చేసి ఉంటారు.

ప్ర‌తి సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికం జ‌న‌వ‌రి నుండి మార్చి స‌మ‌యంలో గ‌రిష్ట వ్యాపారాన్ని పొంద‌డానికి బీమా కంపెనీలు ర‌ద్దీగా ఉండే కాలం. ఇలాంటి కాలంలోనే ప‌న్ను చెల్లింపుదారులు కేవ‌లం ప‌న్ను ఆదా కోసం బీమాను కొనుగోలు చేసి పొరపాటు చేస్తారు. అధిక బీమా చెల్లించి బీమా కంపెనీల చేతిలో దీర్ఘకాలం పాటు చిక్కుకుంటారు. జీవిత బీమా ఏజెంట్లు కూడా త‌మ వ్యాపార అభివృద్ధికి, టార్గెట్‌ల‌ను సాధించ‌డానికి మనపై మార్చి నెల‌లో ఒత్తిడి చేస్తుంటారు. ఏజెంట్‌తో మొహ‌మాటానికి పోయి జీవిత బీమా పాల‌సీని తీసుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు. బీమా అవ‌స‌రం చాలా ఎక్కువ కాబ‌ట్టి స‌రైనా పాల‌సీ తీసుకోవాలి, ముఖ్యంగా ట‌ర్మ్ బీమా పాల‌సీని తీసుకుంటే మంచిది.

జీవిత బీమాను కొనుగోలు చేసే ముందు అన్ని బీమా పాల‌సీల‌లో బీమా ర‌క్ష‌ణ స‌మానంగా ఉండ‌ద‌ని తెలుసుకోవాలి. మీరు జీవిత బీమా ర‌క్ష‌ణ కోస‌మే బీమాను కొనుగోలు చేస్తున్న‌ట్ల‌యితే, మీరు చెల్లిస్తున్న ప్రీమియంతో అధిక బీమాను పొంద‌డం ప్రాధాన్య‌త‌గా ఉండాలి. ప‌న్ను ఆదా కోసం బీమా తీసుకోకూడ‌దు. మీ వార్షిక ఆదాయానికి 10 రెట్లు స‌మానంగా జీవిత బీమా ఉండాలి. ఏదైనా దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగితే, ట‌ర్మ్ బీమా పాల‌సీ కుటుంబానికి ఆర్ధికంగా భ‌రోసాను ఇస్తుంది. 

బీమాతో రాబ‌డి:

పెట్టుబ‌డితో బీమాను మిళితం చేసే అనేక బీమా పాల‌సీలు ఉన్నాయి. అనేక ఎండోమెంట్‌, మ‌నీ బ్యాక్ పాల‌సీల‌లో, బోన‌స్‌లు, గ్యారెంటీ రాబ‌డులు మొద‌లైన వాటిని జోడించిన త‌ర్వాత కూడా అంత‌ర్గ‌త రాబ‌డి గరిష్టంగా 5-6% కంటే ఎక్కువ‌గా ఉండ‌దు. పాల‌సీ కొనుగోలుదారులు నిర్ణీత మొత్తానికి హామీ ఇచ్చే బీమా పాల‌సీల‌ను గ‌మ‌నించాలి. మెచ్యూరిటీలో సాధార‌ణంగా రాబ‌డిని అందించ‌డానికి అధిక ప్రీమియం వ‌సూలు చేస్తారు.

పాల‌సీ స‌రెండ‌ర్ విలువ:

స‌రెండ‌ర్ విలువ అనేది పాల‌సీ మెచ్యూరిటీకి ముందు పాల‌సీని స్వ‌చ్ఛంధంగా స‌రెండ‌ర్ చేస్తే పాల‌సీదారు పొందే మొత్తం. కొన్ని ర‌కాల బీమా పాల‌సీలు కొంత స‌రెండ‌ర్ విలువ‌ను అంద‌చేస్తుండ‌గా, అన్నింటికీ ఆ సౌక‌ర్యం ఉండ‌దు. ప్ర‌తి పాల‌సీకి, ప్ర‌తి జీవిత బీమా సంస్థ‌తో స‌రెండ‌ర్ విలువ భిన్నంగా ఉంటుంది. స‌రెండ‌ర్ విలువ గురించి బీమా కంపెనీని త‌ప్ప‌కుండా అడ‌గ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

పన్ను ఆదా కోసం:

బీమా పాలసీల ద్వారా సెక్షన్ 80C పరిమితి ప్రకారం రూ. 1.50 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనం పొందవచ్చు. అయితే, పైన తెలిపినట్టు పన్ను ఆదా కోసం మాత్రమే ఈ పాలసీలు ఎంచుకోవడం సరైన పద్ధతి కాదు. ప్రత్యామ్నాయంగా,  మీరు మరికొన్ని పధకాలను పరిశీలించవచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటి దీర్ఘకాల పధకాలను మీ రిస్క్ పరిమితి, ఆర్ధిక లక్ష్యాల ఆధారంగా ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ లో సెక్షన్ 80C, ఎన్పీఎస్ లో 80C తో పాటు అదనంగా రూ. 50 వేల వరకు పెట్టుబడి చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు.

చివ‌ర‌గా: పాల‌సీదారు లేదా నామినీకి మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాలు, హామీ మొత్తం ఎప్పుడు, ఏ నిష్ప‌త్తిలో ల‌భిస్తుందో త‌నిఖీ చేయండి. బీమా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు చేసే క్ష‌ణిక ఆర్ధిక త‌ప్పులు మీ ఆర్ధిక శ్రేయ‌స్సును ప్ర‌భావితం చేస్తాయి. అందువ‌ల్ల బీమా పాల‌సీని కొనుగోలు చేసేట‌ప్పుడు ప‌న్ను ఆదా గురించి మాత్ర‌మే చూడ‌కండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని