Home Loan: మీరు ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? తెలుసుకోవడం ఎలా?

ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా? మరి దానికి మీరు సిద్ధంగానే ఉన్నారా?ఎలా సరిచూసుకోవాలి?...

Updated : 09 Apr 2022 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా? మరి దానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? సిద్ధంగా అంటే కొనుక్కోవాలన్న కోరిక మాత్రమే కాదు. దానికీ కొన్ని లెక్కలు ఉంటాయి. వాటన్నింటినీ సరిచూసుకున్నారా మరి? ‘‘ఇల్లు కొనడానికి మనిషి ఎప్పుడూ పూర్తి సంసిద్ధంగా ఉండడు. అనుకున్న వెంటనే కొనడమే ఉత్తమం’’ అని కొంత మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఉద్యోగం ప్రారంభించిన తొలినాళ్లలోనే ఇల్లు కొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇల్లు సొంతం చేసుకోవడమనేది మన జీవితంలో ఓ పెద్ద నిర్ణయం. మరి అలా అనుకున్న వెంటనే ఇల్లు కొనడం అంత ఉత్తమం కాదు. మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారో? లేదో? సరి చూసుకోవాలి. మరి అది ఎలా సాధ్యం?

రెండు కీలకాంశాలు..

మరీ ధనవంతులైతే తప్ప రుణం లేకుండా ఇల్లును కొనలేరు. మరి గృహరుణం తీసుకోవడానికి ముందు మీ దగ్గర కచ్చితంగా కొంత సొమ్ము(Down payment) ఉండాలి. అలాగే నెలనెలా సులభ వాయిదాలు (EMI) చెల్లించే స్తోమత కూడా ఉండాల్సిందే.

డౌన్‌పేమెంట్‌ ఎంత ఉండాలి?

బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఇల్లు కొనడానికి కావాల్సిన మొత్తాన్ని మంజూరు చేయవు. రుణగ్రహీతలు కచ్చితంగా మొత్తం వ్యయంలో 15-20 శాతం చేతి నుంచి భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. మీరు రూ.1.2 కోట్ల ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే.. అందులో రూ.18-24 లక్షల మీరు డౌన్‌పేమెంట్‌ కింద సొంతంగా చెల్లించాలి. మిగిలిన రూ.80-85 లక్షల రుణం మంజూరవుతుంది. ఒకవేళ మీరు ఈ రూ.18-24 లక్షలు చెల్లించలేకపోతే? మీ దగ్గర కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఉంటే?

అప్పుడు బ్యాంకులు మీకు తక్కువ మొత్తంలో రుణాన్ని మంజూరు చేస్తాయి. మీ రూ.10 లక్షల డౌన్‌పేమెంట్‌ సామర్థ్యాన్ని బట్టి బ్యాంకులు రూ.40-45 లక్షల రుణాన్ని ఇస్తాయి. అప్పుడు మీ ఇంటి కొనుగోలు బడ్జెట్‌ రూ.50-55 లక్షలకు తగ్గిపోతుంది. మీరు రూ.1.2 కోట్లతో కొనాలనుకున్న ఇంటిని కొనలేరు. అంటే మీరు ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. మీరు అనుకున్న ఇంటిని మాత్రం సొంతం చేసుకోలేరు. దానికంటే తక్కువ డబ్బుతో వచ్చే గృహాన్ని కొనాల్సి ఉంటుంది.

సులభ వాయిదాలు చెల్లించే స్తోమత?

సరే, మీ దగ్గర డౌన్‌పేమెంట్‌కు కావాల్సిన డబ్బు ఉందనుకుందాం. మరి నెలవారీ వాయిదాలు చెల్లించగలరా? మీ ఆదాయంలో అన్ని ఈఎంఐల మొత్తం 40 శాతానికి మించకుండా ఉండేలా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఒక్క గృహరుణమే కాదు. వ్యక్తిగత, వాహన, క్రెడిట్‌ కార్డు.. ఈ రుణాలన్నింటి నెలవారీ ఈఎంఐలను లెక్కలోకి తీసుకుంటారు. వాటన్నింటి మొత్తం మీ ఆదాయంలో 40 శాతం మించొద్దు. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం.. రూ.24 లక్షల డౌన్‌పేమెంట్‌ మీ దగ్గర ఉందనుకుందాం. అప్పుడు మీకు రూ.96 లక్షల రుణం కావాల్సి ఉంటుంది. దీనికి మీరు కాలపరిమితిని 25 ఏళ్లుగా ఎంపిక చేసుకున్నారనుకుందాం. వడ్డీరేటు 7.5 శాతం లెక్కన నెలకు మీరు రూ.71,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీ నెలవారీ ఆదాయం రూ.1.2 లక్షలు అనుకుందాం. అందులో 40 శాతం అంటే రూ.48 వేలు మీరు ఈఎంఐలకు కేటాయించే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీకు రూ.96 లక్షల రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. అప్పుడు బ్యాంకులు మీ డౌన్‌పేమెంట్‌ను పెంచుకోవమని చెప్పొచ్చు. లేదంటే రుణ కాలపరిమితినైనా పెంచుకోవాలని సూచిస్తాయి.

వీటినీ పరిగణించండి..

పై రెండు అంశాల ఆధారంగా మీరు ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారో? లేదో? నిర్ణయించుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని చిన్న చిన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

మీ పొదుపు మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌ కోసం వినియోగించడం అంత శ్రేయస్కరం కాదు. కొంత అత్యవసర ఖర్చుల కోసం ఉంచుకోవాలి. నిర్మాణ దశలో ఇంటిని కొనాలనుకుంటే అప్పటి వరకు అద్దె, ఈఎంఐ.. రెండింటినీ కట్టే స్తోమత ఉందా? చూసుకోవాలి. లేదంటే ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఉద్యోగ భద్రత కూడా చాలా ముఖ్యం. మీరు ఒక పనిలో స్థిరంగా లేకపోతే.. మీ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ దంపతులిద్దరూ సంపాదిస్తున్నట్లయితే.. సంయుక్తంగా రుణం తీసుకోవచ్చు. కానీ, రుణం తీరే వరకు ఇద్దరూ పనిచేయగలగాలి. లేదంటే ఒకరిపై భారం పడుతుంది. అలాగే మీ ఈఎంఐల ప్రభావం ఇతర పెట్టుబడి మార్గాలపై.. ఆర్థిక లక్ష్యాలపై లేకుండా జాగ్రత్త పడాలి.

ఎవరో చెప్పారనో.. ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనో ఇల్లు కొనొద్దు. ఇల్లు కొనడం అనేది పోటీ కాదు. పై విషయాలన్నింటినీ సక్రమంగా నిర్వహించగలమనుకుంటేనే ఇల్లు కొనేందుకు ముందుకు వెళ్లడం ఉత్తమం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని