క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరించుకుంటున్నారా?

క్రెడిట్ కార్డు అందించే అనేక ప్రయోజనాల్లో నగదు ఉపసంహరణ ప్రయోజనం కూడా ఒకటి. ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయినప్పుడు, క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే..

Published : 15 Dec 2020 16:03 IST

క్రెడిట్ కార్డు అందించే అనేక ప్రయోజనాల్లో నగదు ఉపసంహరణ ప్రయోజనం కూడా ఒకటి. ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయినప్పుడు, క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును ఉపసంహరించుకోవడం అంత శ్రేయస్కరం కాదు. అలా చేయడం ద్వారా మీరు అనేక చార్జీలను బ్యాంకుకు చెల్లించాల్సి రావచ్చు.

ఉదాహరణకు, ఒకవేళ మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదును ఉపసంహరించుకున్నట్లైతే, మీరు తీసుకున్న మొత్తం ఆధారంగా నెలకు సుమారు 2.5 శాతం నుంచి 3 శాతం వరకు రుసుము వసూలు చేస్తారు, కనీసం మొత్తం రూ. 500 నుంచి రూ. 700 వరకు ఉంటుంది, అయితే ఇది కొన్నిసార్లు తక్కువగా, అలాగే కొన్నిసార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అలాగే ఈ చార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా మారుతూ ఉంటాయని కుబేరా. కామ్ వ్యవస్థాపకులు, సీఈఓ ఆదిత్య కుమార్ తెలిపారు.

అలాగే మీరు కేవలం ఉపసంహరణ ఫీజు మాత్రమే కాకుండా, లావాదేవీకి సంబంధించిన వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, మీరు ఉపసంహరించుకున్న మొత్తంపై రోజువారీ వడ్డీని విధిస్తారు. చాలా సందర్భాల్లో, బ్యాంకులు నెలకు 2.5 శాతం నుంచి 4 శాతం మధ్య వడ్డీ రేట్లను విధిస్తుంటాయి.

నగదు ఉపసంహరణలపై వడ్డీ రహిత సమయం ఉండదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నగదు ఉపసంహరణ చేసిన మొట్టమొదటి రోజు నుంచి వడ్డీ విధిస్తారు. ఈ వడ్డీ రేటు అనేది ఒక్కో బ్యాంకుకు ఒక్కో మాదిరిగా మారుతూ ఉంటుంది. అలాగే ఇది సంవత్సరానికి 48 శాతంగా ఉంటుంది.

అయితే, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును పొందడం చాలా సులభమైన, అలాగే అనుకూలమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే, క్రెడిట్ కార్డు ద్వారా నగదును పొందే ముందే దానిపై విధించే వడ్డీ రేటు, ఇతర చార్జీలను ఒకసారి పరిగణలోకి తీసుకోవడం మంచిది.

క్రెడిట్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరించుకుంటే అమలయ్యే కొన్ని రకాల చార్జీల వివరాలను కింద చూద్దాం.

నగదు ఉపసంహరణ ఫీజు

క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకున్న ప్రతిసారీ ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉపసంహరించిన మొత్తంపై 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది.

వడ్డీ

క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణలపై వడ్డీని నెలవారీ ప్రాతిపదికన వసూలు చేస్తారు. లావాదేవీ చేసిన తేదీ నుంచి తీసుకున్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించేంత వరకు వడ్డీ విధిస్తారు. బ్యాంకులు అన్ని నగదు లావాదేవీలపై నెలకు 2.5 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వడ్డీ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటాయి.

ఆలస్యపు చెల్లింపు ఫీజు

ఒకవేళ మీరు ఉపసంహరించుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే, అప్పుడు మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ పై 15 శాతం నుంచి 30 శాతం వరకు ఆలస్యపు చెల్లింపు ఛార్జీలను విధిస్తారు.

అందువలన క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకోవడం మానేసి, మరొక మార్గంలో అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని