Financial Planing: పిల్లలకు డబ్బు విలువ ఎలా చెప్పాలి?

సంపాదన ప్రారంభమయ్యే నాటికి మీ పిల్లలకు ఆర్థిక అంశాలపై పట్టు ఉండాలి, విలువలు తెలిసిఉండాలి. 

Updated : 14 Jan 2022 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 20, 25 ఏళ్లు దాటినా, ఉద్యోగం చేస్తున్నా కొంత మంది యువత ఇంకా ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రులపై ఆధారపడుతుంటారు. తాము సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడంతో పాటు తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకుంటారు. ఇది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. వారి పదవీ విరమణ నిధిని హరించి వేస్తుంది. ఇదే కొనసాగితే పిల్లల ఆర్థిక భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుంది ఎప్పటికీ ఆర్థిక విషయాలను సొంతంగా నిర్వహించుకోలేరు. పొదుపు, పెట్టుబడులు వంటి వాటిపై ఆస‌క్తి చూపరు. అందుకే చిన్నతనం నుంచే డబ్బు విలువను తెలియజేయడంతో పాటు, ఆర్థిక విషయాలలోనూ అవగాహన కల్పించండి.  

ఎదురయ్యే సమస్యలు..

పిల్లలు ఆర్థికంగా స్వతంత్రులు కాకపోతే మీతో పాటు వారి భవిష్యత్తూ ప్రశ్నార్థకంగా మారుతుంది. పొదుపు, పెట్టుబడుల గురించి వారికి తెలియజేయకపోతే విలాసాలకు అలవాటు పడతారు. అప్పులు చేస్తారు. అందుకే వీలైనంత త్వరగా ఆర్థిక విలువలను నేర్పించాలి. ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

కారణాలు తెలుసుకోండి..

మొదట మీ పిల్లలు వారి ఖర్చులను ఎందుకు నిర్వహించలేకపోతున్నారో తెలుసుకోండి. ఇక్కడ రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి వారి ఖర్చులకు తగినంత ఆదాయం లేకపోవడం, రెండవది తగినంత ఆదాయం ఉన్నప్పటికీ ఎక్కువ ఖర్చు చేయడం. ఈ రెండు సందర్భాలలో వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. వారి ఖర్చులను వారు నిర్వహించుకునే విధంగా సలహాలను ఇవ్వాలి. తక్కువ సంపాదన ఉన్నా ఖర్చులను తగ్గించుకుని పొదుపు ఎలా చేయవచ్చో వివరించాలి. ఒకవేళ మీతో ఆర్థిక విషయాలు మాట్లాడేందుకు ఇబ్బంది పడితే మీ ఆర్థిక సలహాదారుడిని సూచనలు ఇవ్వమని కోరాలి. 

డబ్బు విలువ ఎప్పుడు తెలియజేయాలి?

స్కూల్ లేదా కాలేజీలో వారికి ఫీజులు చెల్లిస్తున్న సమయంలోనే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించాలి. చిన్న వయసులో ఉన్నప్పుడే ఇలాంటి విషయాల గురించి చెప్తే మంచి అలవాట్లను చేసుకుంటారు. అలాకాకుండా వారు అడిగిన ప్రతీసారి డబ్బు ఇస్తుంటే పెట్టుబడులపై ప్రభావం చూపడమే కాకుండా ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. డబ్బు ఇచ్చిన ప్రతిసారి అందులో నుంచి కొంత పొదుపు చేస్తూ ఉండడం నేర్పించాలి. లెక్కలు రాయడం కూడా అలవాటు చేస్తే మంచిది.

తోడ్పాటునివ్వండి, డబ్బు కాదు..

తల్లిదండ్రులు పిల్లలను పొదుపు చేసేలా ప్రోత్సహించాలి. కొన్ని నియమాలను నేర్పించాలి. మొదట తమ వేతనంలో కనీసం 20-30 శాతం పొదుపు చేసేలా చూడాలి. మీకు మీ పిల్లల్ని పోషించేంత స్థోమత ఉన్నప్పటికీ వారి ఆర్థిక నిర్ణయాలు వారే తీసుకునేలా ప్రోత్స‌హించాలి. పెట్టుబడుల నిర్ణయాల్లో సహకరించాలి.

సరైన సందేశాన్నివ్వండి..

మీ పిల్లలు సంపాదించిన డబ్బు వారి ఖర్చులకు సరిపోవట్లేదు.. మీ వద్ద తీసుకుంటున్నారు. లేదా బయట అప్పు చేస్తున్నారు అనుకుంటే ఒకసారి వారు చేసే ఖర్చులను గమనించాల్సి ఉంటుంది. ఎక్కువ అత్యాశకు పోవడం, విలాసాలు అలవాటు చేసుకోవడం మంచిది కాదన్న విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం, పదవీ విరమణ కోసం డబ్బు దాచుకోవడం ముఖ్యం అన్న విషయం వెల్లడించాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం, వినోదం, సినిమాలు, షికార్లు వంటి అనవసర ఖర్చులకు పరిమితి విధించి పొదుపు చేయడం అలవాటు చేసుకునే విధంగా సలహాలను ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని