పత్రాలు.. భద్రంగా ఉన్నాయా?

అవసరమైతే వెతికి పట్టుకోవచ్చు అనుకుంటూ ఎక్కడపడితే అక్కడ దాచేస్తుంటారు

Published : 22 Dec 2020 13:37 IST

మీ ఇంట్లో ముఖ్యమైన పత్రాలు ఎక్కడున్నాయి? అన్నీ ఒక చోట ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం చాలామంది వెంటనే చెప్పలేరు. ఎందుకో తెలుసా? అవసరమైతే వెతికి పట్టుకోవచ్చు అనుకుంటూ ఎక్కడపడితే అక్కడ దాచేస్తుంటారు. తమ జ్ఞాపకశక్తికి తామే పరీక్ష పెట్టుకుంటారు. కానీ, ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదనే సంగతిని గుర్తించాలి. కృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పది నెలల క్రితం ఆన్‌లైన్‌లో ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడు. భార్య మాధవికి మాత్రం ఆ విషయం చెప్పలేదు. ఒకరోజు కార్యాలయం నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మాట్లాడలేని స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. మాధవి తన దగ్గరున్న డబ్బుతోపాటు, క్రెడిట్‌ కార్డులు, బంధువుల నుంచి చేబదులు తీసుకొని బిల్లులు చెల్లించింది. నాలుగు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన కృష్ణ తన పేరుమీద రూ.5లక్షల ఆరోగ్య బీమా ఉందని చెప్పాడు. వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇచ్చాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక బిల్లులన్నీ సమర్పించి, ఖర్చులను తిరిగి పొందాల్సిందగా సూచించింది బీమా కంపెనీ. కానీ, అప్పటికే మాధవి ఎంతో వేదనకు గురయ్యింది. ఇలాంటి సంఘటన చూడ్డానికి చిన్న విషయమే అనిపించినా… అవసరంలో ఎంత పెద్దదో వూహిస్తే అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురవ్వకుండా ఉండాలంటే… మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు.

ఆదాయం ఎక్కడ నుంచి?

కొందరు ఉద్యోగం చేస్తారు… మరికొందరు వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తారు… అద్దెలు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చేవారూ ఉంటారు. కుటుంబానికి ఆధారమైన ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుందనే విషయం గురించి కుటుంబ సభ్యులందరికీ తెలిసి ఉండాలి. కుటుంబ పెద్దగా మీరు చేయాల్సిందేమిటంటే… మీ ఆదాయ మార్గాలేమిటి? ఎక్కడ్నుంచి, ఏ తేదీల్లో ఎంత మొత్తం వస్తుంది అనే వివరాలను ఒక చోట రాసి పెట్టాలి. దీనికి ఆదాయం అనే పేరు పెట్టిన ఫైలును కేటాయించాలి. మార్పులు చేర్పులను నిర్లక్ష్యం చేయకుండా నమోదు చేయాలి.

ఖర్చుల మాటేమిటి?

ఖర్చులకు పద్దులు రాయాలా ఏమిటి? అనుకోవద్దు. రోజువారీ ఖర్చుల గురించి కాకున్నా… కొన్ని నిర్ణీత ఖర్చులు ఉంటాయి కదా వాటి గురించైనా కుటుంబ సభ్యులకు తెలిసి ఉండటం మంచిది. ఉదాహరణకు ఇంటర్నెట్‌, ఫోన్‌, కేబుల్‌, పేపరు, పాలు, కరెంటు, నీటి బిల్లులు ఇలా ఏవి ఏయే తేదీల్లో చెల్లించాలి? ఎవరికి చెల్లించాలి, వారి ఫోన్‌ నెంబర్లు రాసి పెట్టాలి. దీనివల్ల మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మీకు కూడా చెల్లింపులు సులభంగా ఉంటాయి. ఖర్చుల వివరాలను రోజువారీగా నమోదు చేయడం కూడా మంచి అలవాటే. ఇప్పుడు ఎన్నో రకాల మొబైల్‌ ఫోన్‌ యాప్‌లు అందుకు సహాయపడుతున్నాయి.

బ్యాంకు ఖాతా వివరాలు…

ఒక్కో వ్యక్తికి కనీసం రెండు మూడు బ్యాంకు ఖాతాలుంటున్న రోజులివి. ఇంట్లో నలుగురు సభ్యులుంటే… కనీసం 7-8 ఖాతాలైనా ఉంటాయి. ప్రతి వ్యక్తికీ ఉన్న బ్యాంకు ఖాతాలు, వాటి పాస్‌పుస్తకాలు, చెక్కులు అన్నీ ఒకే చోట ఉండేలా చూసుకోవాలి. ఖాతాలకు లాకర్లు అనుసంధానమై ఉంటే… ఏయే ఖాతాలకు ఉన్నాయి? వాటికి నామినీ ఎవరు? అత్యవసరాల్లో లాకర్‌ తెరవాలంటే ఎలాంటి ప్రక్రియలను పాటించాలి? తదితర అంశాలన్నింటినీ అందులో రాసి పెట్టాలి. దీనివల్ల మీ కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బందీ రాకుండా ఉంటుంది. రుణాలకు సంబంధించి కూడా వివరాలను పేర్కొనాలి. ఈఎంఐ ఎంత? రుణ వ్యవధిలాంటివన్నీ ఇందులో ఉండాలి.

బీమా పత్రాలు…

జీవిత, ఆరోగ్య, వాహన తదితర బీమా పత్రాలన్నింటినీ చాలా జాగ్రత్తగా అట్టిపెట్టాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన వివరాలను మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. చెల్లించే ప్రీమియం ఎంత? ఏయే తేదీల్లో చెల్లించాలి? పాలసీల విలువ? నామినీల పేర్లు ఏమిటి? బీమా సలహాదారు, సంస్థల ఫోన్‌ నెంబర్లు కూడా రాసి పెట్టాలి. అప్పుడే అత్యవసరాల్లో మీ కుటుంబ సభ్యులకు బీమా పాలసీలు అండగా నిలబడతాయి. జీవిత బీమా పత్రాలను ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్చుకునే వీలుంది. దీన్ని ఉపయోగించుకోవాలి.

పెట్టుబడుల విషయాలు…

షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేవారు తమ డీమ్యాట్‌ ఖాతాలు ఎక్కడున్నాయి? వాటికి నామినీలు ఎవరు అనే విషయాలను రాసి పెట్టాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాల్లాంటివి ఉన్నప్పుడు వాటి వ్యవధి ఎప్పుడు తీరుతుంది? ఎంత మొత్తం రావచ్చు అనేది అవగాహన ఉండాలి. వాటికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా రాయాలి. డీమ్యాట్‌ ఖాతా సంఖ్య, సంస్థల పేర్లు, సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లను కూడా అందులో పేర్కొనాలి.
ఇవే కాకుండా, పాన్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ల పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్నులు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి.

పత్రాలను క్రమ పద్ధతిలో ఉంచుకోవడం ద్వారా మనకు లభించే ప్రయోజనాలేమిటంటే…

  • ఆదాయ మార్గాలేమిటి? ఎంత ఆదాయం వస్తుందనే విషయంలో ఎప్పుడూ ఒక అంచనా ఉంటుంది.

  • ఖర్చుల జాబితా వల్ల వృథా వ్యయాలను తగ్గించుకునేందుకు వీలుంటుంది.

  • రుణ ఈఎంఐ, బీమా ప్రీమియం చెల్లింపులను సకాలంలో చేసేందుకు అవకాశం ఉంటుంది.

  • పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినీలు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని