Investments: మీ పెట్టుబడులు ఆశించిన రాబడినివ్వడం లేదా? అయితే ఇలా చేయండి!

Investments: పెట్టుబడి ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ ఇవ్వకపోతే.. ఓపికగా సమీక్షించండి. ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించండి. అవసరమైతే నిపుణులను సంప్రదించండి. తగిన మార్పులు చేసి రీఇన్వెస్ట్‌ చేయండి.

Published : 15 May 2023 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంపద సృష్టికి పెట్టుబడి (Investments) కీలకం. అయితే, అత్యంత అనుభవజ్ఞులు సైతం కొన్నిసార్లు తమ పెట్టుబడులు పెద్దగా వృద్ధి చెందడం లేదని ఆందోళన చెందుతుంటారు. ఇది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం..

వ్యూహాన్ని సమీక్షించండి..

పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ రానప్పుడు మొదటగా పెట్టుబడి (Investments) వ్యూహాన్ని సమీక్షించాలి. మీ లక్ష్యాలు, నష్టభయం, కాలపరిమితిని నిశితంగా పరిశీలించండి. మీ పెట్టుబడి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందా? హీనపక్షంలో సంభవించే నష్టాన్ని భరించే సామర్థ్యం మీకుందా? ప్రశ్నించుకోండి. మీ పెట్టుబడి మీ లక్ష్యాలకు అనుగుణంగా లేదని లేదా చాలా రిస్క్‌ తీసుకుంటున్నారని అనిపిస్తే వ్యూహాన్ని పునఃపరిశీలించి కావాల్సిన మార్పులు చేయాలి.

పోర్ట్‌ఫోలియోను వివిధీకరించండి..

మీ పోర్ట్‌ఫోలియోలో ఏయే తరహా పెట్టుబడులు (Investments) ఉన్నాయో చూడండి. తగు మోతాదులో పెట్టుబడులను వివిధీకరించారో లేదో చూసుకోండి. వివిధ రకాల మదుపు మార్గాల్లోకి డబ్బును మళ్లించడం ద్వారా నష్టాలు సంభవించే అవకాశాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. మీ పోర్ట్‌ఫోలియో (Investments Portfolio)లో సరైన వైవిధ్యం లేదని గుర్తిస్తే వెంటనే రీబ్యాలెన్స్ చేయండి. మీ రిస్క్‌ని అంచనా వేయడానికి, మంచి రాబడిని పొందడానికి, కొత్త పెట్టుబడులను జోడించడానికి ఇదే మంచి సమయమని గుర్తించండి.

ఎక్కడ పేలవమైన రిటర్న్స్‌..

ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ ఇవ్వడం లేదని గుర్తించి విశ్లేషించడం చాలా ముఖ్యం. దాని వెనకాల ఉన్న కారణమేంటో పరిశీలించాలి. మీ నియంత్రణలో లేని అంశాల వల్ల రిటర్న్స్‌ తగ్గిపోతున్నాయంటే మీరు చేయగలిగిందేమీ లేదు. ఉదాహరణకు ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయం వల్ల మీ రాబడి తగ్గిపోతే ఏమీ చేసే అవకాశం ఉండదు. లేదా అంతర్జాతీయ కారణాల వల్ల మార్కెట్లు ఒడుదొడుకులకు లోనై రిటర్న్స్‌ తగ్గిపోయినా మన చేతుల్లో ఏమీ ఉండదు. అలాంటప్పుడు మార్కెట్లు కోలుకొని తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. లేదా బలహీన బిజినెస్‌ మోడల్‌ వల్లో లేక మన తప్పుడు నిర్ణయం వల్లనో రాబడి సరిగా లేకపోతే.. వెంటనే మరో మార్గంలోకి మదుపును మళ్లించాలి.

అనుభవజ్ఞుల సలహా..

మీ పెట్టుబడులు (Investments) రాణించకపోవడానికి కారణమేంటో మీకు అంతుచిక్కనపుడు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. మీ మదుపులో ఉన్న లోటుపాట్లు ఏంటో వాళ్లు నిశితంగా పరిశీలించి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్‌తో సరిపోయే ఇతర పెట్టుబడి అవకాశాలను గుర్తించడంలో వారు మీకు సహాయపడతారు.

ఓర్పుతో ఉండండి..

పెట్టుబడి (Investments) అనేది దీర్ఘకాలిక వ్యూహమని గుర్తించాలి. రిటర్న్స్‌ తక్కువగా వస్తున్నప్పుడు భయపడి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపికగా ఉండాలి. మీ పెట్టుబడి వ్యూహాన్ని మరోసారి సమీక్షించుకోవాలి. అత్యుత్తమ పెట్టుబడి వ్యూహాలు కూడా స్వల్పకాలిక ఎదురుదెబ్బలను చవిచూస్తాయని గుర్తుంచుకోవాలి. చాలా వరకు మదుపు సాధనాలు దీర్ఘకాలంలో మంచి రాబడినిస్తుంటాయి.

మీ పెట్టుబడి ఆశించిన స్థాయిలో రిటర్న్స్‌ ఇవ్వకపోతే.. ఓపికగా సమీక్షించండి. ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించండి. అవసరమైతే నిపుణులను సంప్రదించండి. తగిన మార్పులు చేసి రీఇన్వెస్ట్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు