ChatGPT: బిర్యానీని టిఫిన్‌గా పేర్కొన్న చాట్‌జీపీటీ.. నాదెళ్ల అభ్యంతరంతో సారీ!

ChatGPT-Biryani: బిర్యానీని దక్షిణాది టిఫిన్‌గా చాట్‌జీపీటీ పేర్కొనడంపై సత్య నాదెళ్ల అభ్యంతరం చెప్పారు. దీంతో ఆయనకు సారీ చెప్పింది.

Published : 05 Jan 2023 13:56 IST

బెంగళూరు: కృత్రిమ మేధతో తయారైన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) మరోసారి వార్తల్లో నిలిచింది. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సత్య నాదెళ్ల (Satya Nadella) అడిగిన ఓ ప్రశ్నకు తప్పు సమాచారం ఇవ్వడం.. దానిపట్ల ఆయన అభ్యంతరం చెప్పడంతో చివరికి సారీ చెప్పింది. ఇంతకీ ఏమైందంటే..

చాట్‌జీపీటీతో సంభాషణలో భాగంగా నాదెళ్ల.. దక్షిణ భారత్‌కు చెందిన ప్రముఖ అల్పాహారం గురించి ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ వంటి పదార్థాలను చూపిస్తుందని ఆయన భావించారు. అయితే, చాట్‌జీపీటీ అనూహ్యంగా బిర్యానీని టిఫిన్‌గా పేర్కొనడంతో నాదెళ్ల అవాక్కయ్యారు.

బిర్యానీని టిఫిన్‌గా పేర్కొనడం ద్వారా హైదరాబాద్‌కు చెందిన తన తెలివితేటలను అవమానించొద్దంటూ చాట్‌జీపీటీకి నాదెళ్ల సూచించారు. ఆ తర్వాత ఈ విషయమై చాట్‌జీపీటీ తనకు సారీ చెప్పినట్లు తెలిపారు. అనంతరం తన సంభాషణను కొనసాగించారు.

ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న నాదెళ్ల బెంగళూరులో  బుధవారం నిర్వహించిన టెక్నాలజీ సమ్మిట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐ, క్లౌడ్‌పై మాట్లాడుతూ చాట్‌జీపీటీని ప్రస్తావించారు. భారత్‌లో పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్‌ కట్టుబడి ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని