పెట్టుబడుల‌కు ముందు రిస్క్‌ను అంచనా వేసుకోండి

మార్కెట్లలో పెట్టుబ‌డులు ప్రారంభించేముందు న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నా వేసుకుంటే పెట్టుబ‌డుల‌కు సుల‌భ‌మ‌వుతుంది...

Published : 18 Dec 2020 14:13 IST

మార్కెట్లలో పెట్టుబ‌డులు ప్రారంభించేముందు న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నా వేసుకుంటే పెట్టుబ‌డుల‌కు సుల‌భ‌మ‌వుతుంది​​​​​​​

మార్కెట్లు కొంత ఒడుదొడుకుల‌కు లోన‌వ‌గానే షేర్ల‌ను విక్ర‌యించేవారే ఎక్కువ‌. వారు రిస్క్‌ను త‌ట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియో త‌యారు చేసుకునేట‌ప్పుడు ఇవ‌న్నీ విష‌యాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకోగ‌ల‌రు అని అంచ‌నా వేసుకొని ముంద‌డుగు వేయాలి.

న‌ష్ట‌భ‌యం అంటే ఏమిటీ?

మ‌దుప‌ర్లు అంచ‌నా వేసుకున్న దానికంటే, త‌క్కువ రాబ‌డి వ‌చ్చే ప‌రిస్థితిని న‌ష్టభ‌యం అంటారు. ప్ర‌భుత్వ సెక్యురిటీల‌లో త‌ప్ప ప్ర‌తీ పెట్టుబ‌డి సాధ‌నంలో ఎంతోకొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది. న‌ష్ట‌భ‌య తీవ్ర‌త ఆయా పెట్టుబ‌డి సాధ‌నాలు ఇచ్చే రాబ‌డి పై ఆధార‌ప‌డి ఉంటుంది. రాబ‌డి,న‌ష్ట‌భ‌యం రెండూ ఒకే దిశలో పయనిస్తాయి. ఎక్కువ‌గా రిస్క్ ఉన్న పెట్టుబ‌డి సాధ‌నాల్లో ఎక్కువ రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న సాధ‌నాల్లో త‌క్కువ రాబ‌డి ఉంటుంది.

పెట్టుబడి పెట్టాలనే యోచన సాధారణంగా వ్యక్తి వయసు, ఆదాయం, పెట్టుబడులతో ఉన్న అనుభవం,రాబడులను అర్థం చేసుకోవడం, సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన, సరైన నిర్ణయం తీసుకోగల నేర్పును బట్టి ఉంటుంది. పెట్టుబ‌డి చేసేముందు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పాటించ‌డం ద్వారా న‌ష్టం రాకుండా నివారించ‌వ‌చ్చు. న‌ష్ట‌భ‌యాన్ని స‌మ‌న్వ‌యం చేసుకోలేక‌పోతే షేర్లు అమ్మ‌కం త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో తొంద‌ర‌ప‌డి మార్కెట్ల ఒడుదొడుకుల‌కు లోన‌వ‌గానే షేర్లు విక్ర‌యిస్తుంటారు. గ‌తంలో స్టాక్‌ల ప‌నితీరును, దేశ ఆర్థిక విష‌యాల‌ను అర్థం చేసుకోగ‌లిగితే మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

రిస్క్‌ను అంచ‌నా వేయ‌డం:

పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు ఎవ‌రికి వారు కొన్ని ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానాలు చెప్పుకోవాలి. ఒక‌వేళ ఏవైనా కార‌ణాల చేత‌ మార్కెట్లు 15 శాతం న‌ష్ట‌పోతే అప్పుడు ఏం చేస్తారు. 1. ఏమీ చేయ‌రు 2. వెంట‌నే షేర్ల‌ను విక్ర‌యిస్తారు 3.ఇంకా ఎక్కువ షేర్ల‌ను కొనుగోలు చేస్తారు. 4.నిర్ణ‌యం తీసుకునేముందు కొన్ని రోజులు వేచి చూస్తారు. ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకొని ముందే సిద్ధ‌మైపోతే మార్కెట్లు ప్ర‌తికూలంగా ఉన్న‌ప్పుడు ఒత్తిడికి గుర‌వ‌రు.

ఉదాహ‌ర‌ణ‌కు, అప్పుడే కొత్త‌గా ఉద్యోగంలో చేరిన వ్య‌క్తికి, ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చేర‌వలో ఉన్న వ్య‌క్తికి రిస్క్ తీసుకునే విష‌యంలో చాలా తేడా ఉంటుంది. కొత్త ఉద్యోగి మ‌రొక 35-40 ఏళ్ల వ‌ర‌కు ఉద్యోగం చేయ‌గ‌లుగుతాడు. నెల‌వారిగా ఆదాయం ల‌భిస్తుంది, కాబ‌ట్టి అత‌డు ఎక్కువ రిస్క్ ఉన్న‌వాటిలో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. కానీ ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న వ్య‌క్తి అయితే వ‌య‌సు, బాధ్య‌త‌లు, నెల‌వారిగా ఆదాయం లేని కార‌ణంగా అంత రిస్క్ తీసుకోలేడు.
పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు మీరు ఎంత రిస్క్ తీసుకోగ‌ల‌రు, ఎంత న‌ష్ట‌భ‌యానికి సిద్థంగా ఉన్నారనేది విశ్లేషించుకోఉవాలి. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు మార్కెట్ల ఒడుదొడుకుల‌ను అదిగ‌మించి రాబ‌డిని ఇచ్చే అవ‌కాశం ఉంటుంది.

నిజాయితిగా ఉండండి:

మీ రిస్క్ గురించి అంచ‌నా వేసేట‌ప్పుడు నిజాయితీగా ఉండండి.ఇది మీ పెట్టుబ‌డుల‌కు సాయ‌ప‌డుతుంది. చాలామంది పెట్టుబ‌డుదారులు, పెట్టుబ‌డులు ప్రారంభించేట‌ప్పుడు ఎంతో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని గొప్ప‌గా ప్రారంభిస్తారు. కానీ మార్కెట్లు కాస్త అవ‌క‌త‌వ‌క‌ల‌కు గురికాగానే షేర్ల‌ను విక్రయస్తుంటారు. రిస్ ఎక్కువ ఉన్న‌ప్పుడు స‌హ‌జంగా ఒత్తిడికి గుర‌వుతుంటారు. ఆ విధంగా మీరు ఎంత వ‌ర‌కు త‌ట్టుకోగ‌ల‌రు, పెట్టుబ‌డుల ల‌క్ష్యం ఏమిటి, ఎంత‌కాలం కొన‌సాగిస్తారు వంట‌తి వాటిపై స్ప‌ష్ట‌త ఉంటే న‌ష్ట భ‌యం ఒత్తిడిని ఎదుర్కునే అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని