పెట్టుబ‌డి కేటాయింపుల థంబ్ రూల్

ప్ర‌తీ రోజూ పెట్రోల్ రేటు ఎందుకు పెరిగుతుందో తెలీదు? వార్త‌ల్లో రూపాయి బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని చెప్తే, ట్రంప్ వ‌ల్లే ఇందంతా అని బ‌య‌ట జ‌నం అనుకుంటున్నారు.......

Published : 19 Dec 2020 11:28 IST

ప్ర‌తీ రోజూ పెట్రోల్ రేటు ఎందుకు పెరిగుతుందో తెలీదు? వార్త‌ల్లో రూపాయి బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని చెప్తే, ట్రంప్ వ‌ల్లే ఇందంతా అని బ‌య‌ట జ‌నం అనుకుంటున్నారు.

పెట్రోల్ ధ‌ర రోజూ పెర‌గ‌డానికి కార‌ణం ఏంటో తెలియ‌ని సామాన్య ప్ర‌జ‌లు… షేర్ మార్కెట్ల సూచీలు ఎందుకు కింద‌కొస్తున్నాయో తెలియ‌ని చిన్న మ‌దుప‌ర్లు…స్థిరాదాయ పెట్టుబ‌డుల‌కు కూడా గ్యారంటీ ఉండ‌దా? అనే భావ‌న ఇటీవ‌లె జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల మ‌దుప‌ర్ల‌లో క‌ల‌గ‌డం… ఇవ‌న్నీ మ‌దుప‌ర్ల‌లో ఆందోళ‌న క‌లిగించే అంశాలే గానీ… ఆందోళ‌న ప‌డ‌కుండా ఉండ‌టం ప్ర‌స్తుతం చాలా అవ‌స‌రం. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే త‌ప్ప, త‌గ్గ‌డం లేదు. దీంతో పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ బ‌ల‌హీన‌ప‌డుతుండ‌టం. వీట‌న్నింటి ప్ర‌భావం వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి రిజ‌ర్వు బ్యాంకు రెపో రేటు పెంచుతుంద‌ని అనుకోవ‌డం… దాని కంటే ముందే మ‌న బ్యాంకులు కాస్త ముందుచూపుతో ఎమ్‌సీఎల్ఆర్ పెంచ‌డం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు. ఈ నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించుకోవాలంటే ఏంచేయాలి? దీనికి మ‌దుప‌ర్లు పాటించాల్సిందేంటంటే క‌చ్చిత‌మైన పెట్టుబ‌డుల కేటాయింపు(అసెట్ అలోకేష‌న్). పెట్టుబ‌డుల‌ను విభ‌జించి వివిధ వ‌ర్గాల్లో మ‌దుపు చేయ‌డం ద్వారా వైవిధ్య‌త పెరిగి న‌ష్ట‌తీవ్ర‌త త‌గ్గుతుంది. అసెట్ అలోకేష‌న్ అంటే ఏంటి? ఎందుకు దీన్ని చేయాలి? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం.

అసెట్ అలోకేష‌న్ అంటే పెట్టుబ‌డుల కేటాయింపు అని అర్థం. మ‌దుప‌ర్లు త‌మ‌ పెట్టుబ‌డిని ఏయే వ‌ర్గాల‌కు చెందిన వాటిలో చేయాలి అనే అంశంపై స్ప‌ష్టంగా ఉండాలి. ఆ ప్ర‌కారం పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు.

ఒక మ‌దుప‌రి సిప్ విధానంలో గానీ ఒకేసారి గానీ కొంత మొత్తం పెట్టుబ‌డి చేద్దామ‌నుకున్న‌పుడు ముందుగా వేటిలో మ‌దుపు చేయాలి అని స్ప‌ష్ట‌త ఉండాలి. ఇది ఆయా వ్య‌క్తుల న‌ష్ట‌భ‌యం, రాబ‌డి అంచ‌నా, ఆర్థిక ల‌క్ష్యం త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

పెట్టుబ‌డి వ‌ర్గాలు:

ఈక్విటీ , డెట్ (స్థిరాదాయ), స్థిరాస్తి, బంగారం ప్ర‌ధానంగా అందుబాటులో ఉండే నాలుగు ర‌కాల పెట్టుబ‌డి వ‌ర్గాలు

ఈ నాలుగింటిలో ఎందులో ఎంత శాతం పెట్టుబ‌డి చేయాలి అనేది మ‌దుప‌రి త‌న వ‌య‌సు, ఆర్థిక‌ల‌క్ష్యం, న‌ష్ట‌భ‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబ‌డి కేటాయింపుల‌ను చేసుకోవాలి.

ఈక్విటీలో పెట్టుబ‌డి చేసేందుకు 100 నుంచి త‌మ వ‌య‌సును తీసివేస్తే వ‌చ్చే శాతం ఈక్విటీలో పెట్టుబ‌డి చేయోచ్చ‌ని సూచిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా వ్య‌క్తుల‌ను బ‌ట్టి ఉంటుంది. త‌క్కువ వ‌య‌సు వారు కూడా న‌ష్టంరాకుండా ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాల‌ని అనుకోవ‌చ్చు. కొంత మంది మ‌దుర్లు వ‌య‌సుతో నిమిత్తం లేకుండా కాస్త న‌ష్ట‌భ‌యం ఉన్నాగానీ రాబ‌డి వ‌చ్చే వాటిలో మ‌దుపు చేయాల‌నుకోవ‌చ్చు. అందుకే మ‌దుప‌ర్లు దీన్ని ఒక థంబ్ రూల్ గా మాత్ర‌మే భావించాలి

థంబ్ రూల్ ప్ర‌కారం వ‌య‌సు ప్రాతిపాదిక‌న చేయాల్సిన పెట్టుబ‌డులు:

  • 20 సంవ‌త్స‌రాలు ఉండే వ్య‌క్తి
    ఈక్విటీలో 80 శాతం, స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో 15 శాతం, న‌గ‌దురూపంలో 5 శాతం.

  • 30 సంవ‌త్స‌రాలు ఉండే వ్య‌క్తి
    ఈక్విటీలో 70 శాతం, స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో25 శాతం, న‌గ‌దురూపంలో 5 శాతం.

  • 40 సంవ‌త్స‌రాలు ఉండే వ్య‌క్తి
    ఈక్విటీలో 60 శాతం, స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో25 శాతం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌లో 10 శాతం, న‌గ‌దురూపంలో 5 శాతం

  • 50 సంవ‌త్స‌రాలు ఉండే వ్య‌క్తి
    ఈక్విటీలో 50 శాతం, స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో30 శాతం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌లో18శాతం,న‌గ‌దురూపంలో 2 శాతం

  • 60 సంవ‌త్స‌రాలు ఉండే వ్య‌క్తి
    ఈక్విటీలో 40 శాతం, స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో40 శాతం,స్థిరాస్తి పెట్టుబ‌డుల‌లో18 శాతం, న‌గ‌దురూపంలో 2 శాతం

పైన పేర్కొన్న పెట్టుబ‌డి కేటాయింపులు అంద‌రికీ క‌చ్చితంగా స‌రిపోతాయ‌ని చెప్ప‌లేం, అంచ‌నా మాత్ర‌మే. దీనిపై మ‌రింత స్ప‌ష్టత కావాలనుకుంటే ఆర్థిక స‌ల‌హాదారులను సంప్ర‌దించ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని