Budget 2024: బడ్జెట్ 2024: అటల్‌ పెన్షన్‌ యోజన ₹10 వేలకు పెంపు..?

Budget 2024: జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అటల్‌ పెన్షన్‌ యోజనకు సంబంధించి పెన్షన్‌ మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 09 Jul 2024 14:35 IST

Budget 2024 | దిల్లీ: సామాజిక భద్రతా పథకం అటల్‌ పెన్షన్‌ యోజనలో (Atal Pension yojana) కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద అందించే పెన్షన్‌ మొత్తాన్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. గ్యారెంటీ పెన్షన్‌ మొత్తాన్ని రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచాలని చూస్తోంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేస్తోందని సమాచారం. అటల్‌ పెన్షన్‌ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారెంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పింఛను పథకాలకు నోచుకోని వారికోసం అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని 2015 బడ్జెట్‌లో ప్రకటించారు. నెలకు రూ.1000-5000 వరకు పెన్షన్‌ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) దీన్ని నిర్వహిస్తుంది.

నెలకు ₹210 కాంట్రిబ్యూషన్‌తో ₹5 వేల పెన్షన్‌

ఈ పథకం ప్రారంభమైన తర్వాత తొలిసారి 2023-24లోనే ఎక్కువమంది ఇందులో చేరారని పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్‌ దీపక్‌ మొహంతి ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న మొత్తం భవిష్యత్‌ అవసరాలకు చాలవు కాబట్టి.. ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందని పీఎఫ్‌ఆర్‌డీఏ కూడా అభిప్రాయపడింది. ఈనేపథ్యంలో పెన్షన్‌ మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆమేరకు ప్రకటన వెలువడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని