అటల్ పెన్షన్ యోజన పథకం vs జాతీయ పింఛను పథకం

ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇంకా మీరు పన్ను ఆదా పెట్టుబడులను చేయకపోతే, మీకోసం రెండు పథ‌కాలను తెలియచేస్తున్నాం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఈ రెండు పథ‌కాల ద్వారా మీరు రూ. 1,50,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందగలరు....

Updated : 02 Jan 2021 14:47 IST

అటల్ పెన్షన్ యోజన పథ‌కం అసంఘటిత రంగంపై కేంద్రీకృతమై ఉండగా, జాతీయ పింఛను పథకం మాత్రం అందరికీ వర్తిస్తుంది

ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇంకా మీరు పన్ను ఆదా పెట్టుబడులను చేయకపోతే, మీకోసం రెండు పథ‌కాలను తెలియచేస్తున్నాం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఈ రెండు పథ‌కాల ద్వారా మీరు రూ. 1,50,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందగలరు. అవే జాతీయ పింఛను పథకం (ఎన్పీఏస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై). ఈ రెండు పథ‌కాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అటల్ పెన్షన్ యోజన పథ‌కం కేవలం అసంఘటిత రంగంపై కేంద్రీకృతమై ఉండగా, జాతీయ పింఛను పథకం మాత్రం అందరికీ వర్తిస్తుంది. అంతే కాకుండా ప్రవేశ వయస్సు,చెల్లింపులు, రాబడులు, పన్ను అంశాలు చాలా భిన్నంగా ఉంటాయి. మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, ఉత్తమమైన అంశాల ఆధారంగా మీకు స‌రిపోయే మంచి పథకాన్ని ఎంచుకోవాలని ఆర్ధిక నిపుణులు తెలియచేస్తున్నారు. కానీ, ఏ పథకం తీసుకోవాలో నిర్ణయం తీసుకునే ముందు ఈ పథకాల మధ్య గల ప్రాథమిక తేడాలను తెలుసుకోవడం మంచిది.

అటల్ పెన్షన్ యోజన, జాతీయ పింఛను పథ‌కానికి సంబంధించిన 10 ప్రాథమిక తేడాలను కింద తెలియచేశాం :

  1. వయస్సు: అటల్ పెన్షన్ యోజన పథకం, జాతీయ పింఛను పథకంలో చందాదారులు అవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అయితే గరిష్ట వయస్సు పరిమితిలో మాత్రం తేడా ఉంటుంది. జాతీయ పింఛను పథకంకు గరిష్ట వయస్సు 60 సంవత్సరాలుగా నిర్ణయించారు, అయితే అటల్ పెన్షన్ యోజనా పథకానికి మాత్రం గరిష్ట వయస్సును 40 సంవత్సరాలుగా నిర్ణయించారు.
  1. పెట్టుబడి పరిమితి : జాతీయపింఛ‌న్ పథకంలో పెట్టే గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. అటల్ పెన్షన్ యోజన పథకం అనేది స్థిరమైన పింఛ‌న్ పొందడానికి ముందుగా నిర్ణయించిన నెలవారీ చెల్లించవలసిన మొత్తం ఆధారంగా పనిచేస్తుంది, ఎన్‌పీఎస్‌లో పెన్షన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలవారీ చెల్లించవలసిన మొత్తం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి పింఛ‌న్ సంపాదించటానికి 18 సంవత్సరాల వయస్సులో నెలకు రూ. 210 చెల్లించినట్లైతే, 42 సంవత్సరాల తర్వాత అతను నెలకు రూ. 5,000 పెన్షన్ గా పొందుతాడు.

  2. కనీస పెట్టుబడి : జాతీయ పింఛ‌న్ పథకంలో ఒక్కో చందాదారుడు కనీసం చెల్లించవలసిన మొత్తం రూ. 500, అలాగే ఒక ఆర్థిక సంవత్సరానికి చెల్లించవలసిన కనీస మొత్తం రూ. 6,000. అటల్ పెన్షన్ యోజన పథకంలో చెల్లించవలసిన మొత్తం మూడు పద్ధతులతో ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక చెల్లింపుగా విధానం ఉంటుంది. ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు అటల్ పెన్షన్ యోజన పథకంలో 18 ఏళ్ల చందాదారుడు, నెలకు రూ. 42 లేదా అర్ధ సంవత్సరానికి రూ. 248 చొప్పున 60 సంవత్సరాలు చెల్లించిన తర్వాత అతను నెలకు రూ. 1,000 పెన్షన్ పొందుతాడు.

  3. రాబడులు : అటల్ పెన్షన్ యోజన పథకం ముందుగా నిర్ణయించిన ప్ర‌కారం రాబడులను అందిస్తుంది (రూ. 1,000, రూ. 5,000). అయితే, జాతీయ పెన్షన్ పథకంలో రాబడులు మార్కెట్లకు అనుసంధానం చేసి ఉంటాయి. మార్కెట్ విలువ, పెట్టుబ‌డి చేసే స‌మ‌యం త‌దిత‌ర అంశాల‌పై ఆధారపడి ఉంటుంది.

  4. ఎవరు సభ్యత్వాన్ని పొందవచ్చు: అటల్ పెన్షన్ యోజన ఖాతాను తెరవడానికి అభ్యర్థి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. జాతీయ పింఛ‌న్ పథకంలో భారతీయులతో పాటు ఎన్ఆర్ఐలు కూడా చేరవచ్చు. ఎన్స్డీఏల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెబ్ సైట్ ప్రకారం, ఓసీఐ (ఇండియన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియన్), పీఐఓ (పెన్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) కార్డు హోల్డర్లు అలాగే హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్యూఏఫ్ లు) మాత్రం జాతీయ పింఛ‌న్ పథకంలో చేరడానికి అనర్హులు.

  5. అనుకూలతలు : అటల్ పెన్షన్ యోజన పథకంలో దరఖాస్తుదారుడి వయస్సు, స్థిరమైన పెన్షన్ మొత్తం ఆధారంగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్, ఎంపిక చేసిన స్లాబ్ ఆధారంగా అందిస్తుంది. జాతీయ పింఛ‌న్ పథ‌కం మార్కెట్ ఆధారిత పెట్టుబ‌డి సాధ‌నాల‌తో అనుసంధానం అయి ఉంటుంది. దరఖాస్తుదారుడు తన ప్రాధాన్యత ప్రకారం వేర్వేరు అసెట్ క్లాసులు(ఆస్తి తరగతుల)లో పెట్టుబ‌డి కేటాయింపులు చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆస్తి తరగతుల్లో ఈక్విటీ, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. దీని కోసం ఈ ప‌థ‌కంలో “ఆటో సెలెక్ష‌న్” ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

  6. ఖాతా రకం: అటల్ పెన్షన్ యోజన కేవలం ఒక రకమైన ఖాతాను అందిస్తుంది, అదే జాతీయ పింఛ‌న్ ప‌థ‌కం రెండు రకాల ఖాతాలను అందిస్తుంది. వీటిలో టైర్ I, టైర్ II ఉంటాయి. టైర్ -1 ఖాతాలో చందాదారుడు తనకు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు దానిని ఉపసంహరించుకోలేరు. టైర్ -2 ఖాతా అనేది స్వచ్ఛంద ఉపసంహరణ ఖాతా, అంటే ఉపసంహరణలపై ఎలాంటి పరిమితులు లేవు. అంతేకాకుండా, టైర్ II ఖాతా అనేది యాడ్-ఆన్ అకౌంట్, అంటే టైర్ 1 ఖాతాను కలిగి ఉన్న చందాదారుడు దానిని హోల్డ్ చేసి, టైర్ II ఖాతాను తెరుచుకోవచ్చు.

  7. ముందస్తు నిష్క్రమణ : అటల్ పెన్షన్ యోజన చందాదారులు కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే 60 సంవత్సరాల వయస్సులోపు పథకం నుంచి ముందస్తు నిష్క్రమణ అయ్యే అవకాశం ఉంది. అవి మరణం / న‌యం కాని వ్యాధులు సోకిన సందర్భాల్లో మాత్రమే ముందస్తు నిష్క్రమణకు అనుమతిస్తారు.

  8. రెండు పథకాలలో చందాదారుడి వయస్సు 60 సంవత్సరాలు దాటిన తరువాత పెన్షన్ మొదలవుతుంది.

  9. అటల్ పెన్షన్ యోజన పథకంలో కూడా జాతీయ పింఛ‌న్ పథకం మాదిరిగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఈ రెండు పధకాల ద్వారా మీరు రూ. 1,50,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందవ‌చ్చు. అయితే, జాతీయ పింఛను పథకం లో అదనంగా రూ. 50 వేల పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఒకవేళ చందాదారుడు మరణించినట్లైతే, నెలవారీ పింఛను వారి జీవిత భాగస్వామికి అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని