Sri lanka Crisis: లంక సంక్షోభం.. ఈ విమానాశ్రయాలకు కాసుల వర్షం!

ఆర్థికంగా కుదేలై తీవ్ర చమురు కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక (Sri lanka Crisis).. దక్షిణ భారతంలో ఉన్న విమానాశ్రయాలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Published : 11 Jul 2022 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థికంగా కుదేలై తీవ్ర చమురు కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక (Sri lanka Crisis).. దక్షిణ భారతంలో ఉన్న విమానాశ్రయాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారి సంక్షోభం వీరికి అవకాశంగా మారింది. శ్రీలంకలో చమురు కొరత ఎదుర్కొంటున్న విమానాలు దక్షిణాదిలో ఉన్న తిరువనంతపురం, కోచి, చెన్నై విమానాశ్రయాలపై ఆధారపడుతుండడమే దీనికి కారణం.

కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్రమైన చమురు కొరత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత నెల 29 నుంచి విమానాలకు వాడే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) విషయంలో ఆ దేశం పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ద్వీప దేశానికి విమాన సర్వీసులు నడుపుతున్న శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ అరేబియా, జజీరా ఎయిర్‌లైన్స్‌, గల్ఫ్‌ ఎయిర్‌, ఎయిర్‌ ఆసియా వంటి విమానయాన సంస్థలు భారత్‌పై ఆధారపడుతున్నాయి. మే చివరి నుంచే ఈ సంస్థలన్నీ ఇక్కడి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నుంచి ఏటీఎఫ్‌ను కొనుగోలు చేస్తున్నాయి. జూన్‌ 29 తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. దీంతో ఆయా విమానాశ్రయాలు నడిపే ఆపరేటర్‌తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతోంది. ఇతర దేశాలకు చెందిన కొన్ని విమానయాన సంస్థలు సైతం దక్షిణాది ఎయిర్‌పోర్టుల్లో ఏటీఎఫ్‌ కోసం దిగుతున్నాయి.

ఒక్కో విమానానికీ ₹లక్ష..

విమానంలో ఇంధనం నింపుకొనేందుకు ఆయా విమానాలు టెక్నికల్‌ ల్యాండింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నాయి. ఇలా టెక్నికల్‌ ల్యాండ్‌ అయ్యి ఏటీఎఫ్‌ను నింపుకోవడం వల్ల ఒక్కో విమానానికి లక్ష చొప్పున సదరు ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌కు ఆదాయం సమకూరుతోంది. ఏటీఎఫ్‌పై ఉన్న పన్నుల వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల నుంచి యూరప్‌కు వెళ్లే విమానాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని విమానాశ్రయాలపైనే ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా తిరువనంతపురం విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్‌కు లంక సంక్షోభం కాసుల వర్షం కురిపిస్తోంది. మే చివరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 90కి పైగా విమానాలు ఇక్కడ ఏటీఎఫ్‌ను నింపుకొన్నట్లు తెలుస్తోంది. కోచి విమానాశ్రయంలో జూన్‌ 29 నుంచి సుమారు 28 విమానాలు ఏటీఎఫ్‌ కోసం దిగాయి. దీంతో అక్కడి విమానాశ్రయం ల్యాండింగ్‌ ఛార్జీలపై 25 శాతం రాయితీ కూడా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని