ATF price hike: ఈ ఏడాది ఐదోసారి పెరిగిన విమాన ఇంధన ధరలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో విమాన ఇంధన ధరను పెంచుతున్నట్లు మంగళవారం చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి....

Published : 01 Mar 2022 15:23 IST

కిలోలీటర్‌పై రూ.3,010 పెంపు

దిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ATF) ధరను 3.3 శాతం పెంచుతున్నట్లు మంగళవారం చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. 2022లో ధరలు పెరగడం ఇది ఐదోసారి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం గత 116 రోజులుగా ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.

విమానాల ఇంధన ధర దిల్లీలో కిలోలీటర్‌పై రూ.3,010.87 పెరిగి, రూ.93,530.66కి చేరింది. విమానయాన సంస్థలు భరించే ఖర్చుల్లో 40 శాతం ఇంధనానికే వెచ్చిస్తాయి. ఈ ఏడాది ధరలు కొత్త గరిష్ఠాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. 2022 ఆరంభం నుంచి ప్రతి 15 రోజులకొకసారి ధరలు పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఏటీఎఫ్‌ ధరలు 26.35 శాతం అంటే కిలోలీటర్‌పై రూ.19,508.25 పెరిగింది. కొవిడ్‌ సంక్షోభంతో ఇప్పటికే తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి ధరల పెరుగుదల మరింత భారంగా పరిణమిస్తోంది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర గతవారం 105 డాలర్ల వద్ద గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 100.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు