Fuel Price: తగ్గిన విమాన ఇంధనం ధర.. పెట్రోల్‌, డీజిల్‌ నో ఛేంజ్‌!

Fuel Price: చమురు సంస్థలు విమాన ఇంధన ధరను తగ్గించాయి. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

Published : 01 Dec 2022 14:42 IST

దిల్లీ: విమాన ఇంధన ధరల్ని దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు 2.3 శాతం తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణం. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

తాజా సవరణతో విమాన ఇంధనం (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌- ATF) ధర కిలోలీటర్‌పై రూ.2,775 తగ్గి రూ.1,17,587.64కు చేరింది. ఇది విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే అంశం. ఆయా సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అయ్యే ఖర్చులో 40 శాతం వాటా ఇంధనానిదే. గత నెల కూడా కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధరను చమురు సంస్థలు రూ.4,842.37 తగ్గించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, విదేశీ మారక రేట్లకు అనుగుణంగా ఏటీఎఫ్‌ ధరల్ని ప్రతినెలా ఒకటో తారీఖున సవరిస్తుంటాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని మాత్రం చమురు సంస్థలు మార్చలేదు. వరుసగా ఎనిమిది నెలల నుంచి ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.62గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని ప్రతిరోజూ సవరించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.. చమురు సంస్థలు మాత్రం మే 22 నుంచి ఇప్పటి వరకు మార్పు చేయలేదు. మరోవైపు వరుసగా ఏడు నెలలపాటు వంటగ్యాస్‌ వాణిజ్య సిలిండర్‌ ధరను తగ్గించినప్పటికీ.. ఈ నెల మాత్రం ఎలాంటి సవరణ చేయకపోవడం గమనార్హం. దిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,744గా కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని