Ather energy: ఏథర్‌ 450Xపై ₹30వేలు తగ్గింపు.. ఆ స్కూటర్లకు పోటీగానానే?

Ather energy price slash: ఏథర్‌ ఎనర్జీ తన 450X మోడల్ ధరను భారీగా తగ్గించింది. అందుకు అనుగుణంగా సాంకేతికంగా వాహనంలో కొన్ని మార్పులు చేసింది. అన్ని ఫీచర్లూ కోరుకునే వారికి ప్రో ప్యాక్‌ పేరిట మరో వేరియంట్‌నూ అందిస్తోంది.

Updated : 15 Apr 2023 10:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather energy) ఎట్టకేలకు అందుబాటు ధరలో విద్యుత్‌ స్కూటర్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కొత్తగా తన వాహన శ్రేణిలో మార్పు చేసింది. ఏథర్‌ 450ఎక్స్‌లో (Ather 450x) కొన్ని సాంకేతిక మార్పులు చేసి ధరను ఏకంగా రూ.30వేల మేర తగ్గించింది. అదనపు ఫీచర్ల కోరుకొనే వారి కోసం ప్రో ప్యాక్‌ పేరిట మరో వేరియంట్‌ను అందిస్తోంది.

ఏథర్‌ ఎనర్జీ ఎప్పటి నుంచో దేశంలో విద్యుత్‌ వాహనాలను విక్రయిస్తోంది. ఓలా మార్కెట్లోకి ప్రవేశించనంత వరకు ఏథర్‌దే హవా. ఓలా వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఈవీ మార్కెట్లో ఏథర్‌ జోరు కొనసాగింది. అయితే, ఓవైపు ఓలా, మరోవైపు టీవీఎస్‌ అందుబాటు ధరలో స్కూటర్లను తీసుకురావడంతో ఏథర్‌ మార్కెట్‌ను కోల్పోతూ వచ్చింది. ఆ రెండు స్కూటర్ల ధరలతో పోలిస్తే ఏథర్‌ ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో మార్కెట్‌ వాటా విషయంలో ఓలా, టీవీఎస్‌ కంటే ఏథర్‌ వెనకబడింది.

ఇన్నాళ్లు ప్రీమియం సెగ్మెంటకే పరిమితమైన ఏథర్‌ తాజాగా తన వాహన శ్రేణిలో మార్పు చేసింది. ఏథర్‌ 450 ప్లస్‌ పేరిట ఉన్న వేరియంట్‌ను తొలగించింది. ఏథర్‌ 450X మోడల్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. రైడ్‌ మోడ్స్‌,  టచ్‌స్క్రీన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఏవీ లేకుండా ఉండే 450X వేరియంట్‌ ధరను ఏకంగా రూ.30వేలు మేర తగ్గించింది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం, మ్యూజిక్‌, కాల్స్‌, మ్యాప్స్‌, మొబైల్‌ యాప్‌ కనెక్టివిటీ, పుష్‌ నోటిఫికేషన్‌ వంటి సదుపాయాలనూ ఇందులోంచి మినహాయించింది.

ఈ ఫీచర్లన్నీ కావాలంటే ప్రో ప్యాక్‌ వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మినహా పవర్‌, పెర్ఫార్మెన్స్‌ విషయాల్లో రెండు స్కూటర్లూ ఒకటే. ధరల విషయానికొస్తే.. ఏథర్‌ 450X హైదరాబాద్‌లో రూ.1,14,636 (ఫేమ్‌-2 సబ్సిడీ అనంతరం) లభిస్తుండగా.. ప్రో ప్యాక్‌ వేరియంట్‌ రూ.1.45 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఓలా ఎస్‌ 3kWh వేరియంట్‌ రూ.1.14 లక్షలు ఉండగా.. టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌ ధర రూ.1.21 లక్షలకు లభిస్తున్నాయి. ఏథర్‌ చేసిన ఈ మార్పు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని