Ather Energy: తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు స్కూటర్ల తయారీ కేంద్రం?

దేశంలో మూడో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హీరో మోటోకార్ప్‌ మద్దతు ఉన్న ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది....

Published : 15 Jun 2022 13:36 IST

ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోన్న ఏథర్‌ ఎనర్జీ

దిల్లీ: దేశంలో మూడో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హీరో మోటోకార్ప్‌ మద్దతు ఉన్న ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. ఏటా 15 లక్షల యూనిట్ల తయారీయే లక్ష్యంగా మరో ప్లాంటును నెలకొల్పాలని కంపెనీ యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చర్చలు తుది దశకు చేరాయని వచ్చే నెలలో ఏర్పాటు చేయబోయే స్థలాన్ని ఖరారు చేయనున్నామని తెలిపాయి.

ప్రస్తుతం ఏథర్‌ ఎనర్జీ 450ఎక్స్‌, 450 ప్లస్‌ అనే రెండు విద్యుత్తు స్కూటర్లను తయారు చేస్తోంది. అదనపు తయారీ కేంద్రానికి దాదాపు 100 ఎకరాల స్థలం కోసం ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కంపెనీకి తమిళనాడులోని హోసూరులో ఓ తయారీ కేంద్రం ఉంది. దీని సామర్థ్యం ఒక సంవత్సరానికి 1.2 లక్షల యూనిట్లు. అక్కడే మరో ప్లాంటును కూడా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరికి అందులోనూ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పుడు ఉత్పత్తి సామర్థ్యం నాలుగు లక్షలకు పెరుగుతుంది. ఏథర్‌ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కి 35 శాతం వాటాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని