Ather Energy: ఓలా S1 ఎయిర్‌కు పోటీగా.. ఏథర్‌ నుంచి మరో స్కూటర్‌!

Ather Energy to launch 450S: ఏథర్‌ నుంచి కొత్తగా మరో స్కూటర్‌ రాబోతోంది. ఓలా ఎస్‌1 ఎయిర్‌కు పోటీగా ఎంట్రీ లెవల్‌లో ఈ స్కూటర్‌ను తీసుకొస్తోంది.

Published : 01 Jun 2023 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) ఎంట్రీ లెవల్‌లో ఓ ద్విచక్ర వాహనాన్ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ 450 శ్రేణిలో రెండు స్కూటర్లు విక్రయిస్తోంది. 450ఎక్స్‌ పేరుతో ఒకటి స్టాండర్డ్‌ వేరియంట్‌ను విక్రయిస్తుండగా.. మరిన్ని సదుపాయాలతో ప్రో ప్యాక్‌ పేరుతో మరో స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా అదే 450 సిరీస్‌లో 450S పేరుతో ఓ స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ తాజాగా తెలిపింది. 

ఏథర్‌ 450ఎస్‌ ధరను 1,29,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌తో 115 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. త్వరలో ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేస్తామని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతకు మించి ఇతర వివరాలు ఏవీ వెల్లడించలేదు. ఓలాకు పోటీగానే ఏథర్‌ ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఓలా (Ola electric) ఎస్‌1, ఎస్‌1 ప్రోతో పాటు ఎస్‌1 ఎయిర్‌ పేరుతో ఎంట్రీ లెవల్‌లో ఓ స్కూటర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 450S ద్వారా ఓలాకు పోటీ ఇవ్వాలని ఏథర్‌ భావిస్తోంది.

మరోవైపు విద్యుత్‌ వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో కేంద్రం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌ 1 నుంచి విద్యుత్‌ వాహన ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో స్కూటర్‌పై రూ.10వేల నుంచి రూ.30వేల వరకు ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఏథర్‌ 450 ఎక్స్‌ మోడల్‌ హైదరాబాద్‌లో సబ్సిడీ అనంతరం రూ.1,46,559గా ఉంది. అదే ప్రో ప్యాక్‌ ధర రూ.1,67,073గా ఉంది. అంటే ప్రస్తుతం ఏథర్‌లో ఉన్న ఏ మోడల్‌ కొనాలన్నా రూ.లక్షన్నర వరకు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తక్కువ ధరలో 450S రూపంలో ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌ను తీసుకుకొచ్చేందుకు ఏథర్‌ సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని