ATM cash withdrawal: జ‌న‌వ‌రి 1 నుంచి ఏటీఎమ్ న‌గ‌దు విత్‌డ్రా ఛార్జీలు పెర‌గొచ్చు 

ప‌రిమితికి మించి చేసే న‌గ‌దు, న‌గ‌దుర‌హిత లావాదేవీలకు విధించే ఛార్జీలను జ‌న‌వ‌రి, 2022 నుంచి పెంచేందుకు ఆర్‌బీఐ బ్యాంకుల‌ను అనుమ‌తించింది

Published : 02 Dec 2021 14:30 IST

ప‌రిమితికి మించి చేసే లావాదేవీల‌పై విధించే ఛార్జీలు వ‌చ్చే నెల నుంచి పెరిగే అవ‌కాశ‌ముంది. ఏటీఎమ్‌ల వ‌ద్ద నెల‌వారిగా బ్యాంకులు అందిస్తున్న‌ ఉచిత ప‌రిమితికి మించి చేసే న‌గ‌దు, న‌గ‌దుర‌హిత లావాదేవీలకు విధించే ఛార్జీలను జ‌న‌వ‌రి, 2022 నుంచి పెంచేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో అనుమితించింది.

ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి.. యాక్సిస్ బ్యాంక్ లేదా ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద ఉచిత ప‌రిమితిని దాటి లావాదేవీలు నిర్వహిస్తే జ‌న‌వ‌రి 1, 2022 నుంచి లావాదేవీ రుసుము రూ. 21+జీఎస్‌టీ వ‌ర్తిస్తుంద‌ని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. నెలవారి ప‌రిమితికి మించి ఏటీఎమ్ వ‌ద్ద చేసే ప్ర‌తీ లావాదేవీకి ప్ర‌స్తుతం రూ.20 చార్జ్ చేస్తున్నారు. అధిక ఇంటర్‌చేంజ్ ఫీజు భ‌ర్తీ చేసేందుకు, అలాగే సాధార‌ణ ఖ‌ర్చులు పెర‌గ‌డంతో క‌స్ట‌మ‌ర్ ఛార్జీల‌ను పెంచేందుకు బ్యాంకుల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎమ్‌ల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా), ఇత‌ర బ్యాంక్ ఏటీఎమ్‌ల‌లో మెట్రో న‌గ‌రాల‌లో మూడు, నాన్‌-మెట్రో న‌గ‌రాల‌లో ఐదు ఉచిత లావాదేవీలు చేయ‌వ‌చ్చు. ఇది కాకుండా, ఆర్థిక లావాదేవీల కోసం ప్రతి లావాదేవీకి ఇంటర్‌చేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ. 17కి, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 5 నుంచి రూ. 6 వరకు పెంచేందుకు కూడా సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. ఇది ఆగష్టు 1, 2021 నుంచి అమలులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని