Attrition: ‘ఏడాదిలో ఉద్యోగం మారతాం’.. పీడబ్ల్యూసీ సర్వేలో ఆసక్తికర విషయాలు!

భారత్‌లో వచ్చే 12 నెలల్లో దాదాపు 34 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చే యోచనలో ఉన్నారని ప్రముఖ ఆర్థిక సంస్థ పీడబ్ల్యూసీ సర్వేలో తేలింది....

Published : 18 Aug 2022 19:46 IST

దిల్లీ: భారత్‌లో వచ్చే 12 నెలల్లో దాదాపు 34 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చే యోచనలో ఉన్నారని ప్రముఖ ఆర్థిక సంస్థ పీడబ్ల్యూసీ సర్వేలో తేలింది. దీని వెనుక కారణాలను తెలియజేస్తూ సర్వే ఫలితాలను పీడబ్ల్యూసీ ‘‘ఇండియా వర్క్‌ఫోర్స్‌ హోప్స్‌ అండ్‌ ఫియర్స్‌ సర్వే 2022’’ పేరిట విడుదల చేసింది. కంపెనీల్లో ఎటువంటి పనివాతావరణం ఉండాలని ఉద్యోగులు ఆశిస్తున్నారో కూడా ఈ సర్వే ప్రస్తావించింది.

ఈ సర్వేలో 2,608 మంది పాల్గొన్నారు. వీరిలో 93 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నవారు. సర్వేలో పాల్గొన్నవారిలో 78 శాతం మంది పురుషులు, 16 శాతం మంది మహిళలు, 5 శాతం ఇతరులు, ఒకశాతం మంది తమ లింగ సంబంధిత వివరాలను వెల్లడించలేదు. అలాగే 54 శాతం మంది మిల్లీనియల్స్‌ (26-41 ఏళ్లు) కాగా, 26 శాతం మంది జనరేషన్‌ ఎక్స్‌ (18-25 ఏళ్లు), 15 శాతం మంది జనరేషన్‌ జెడ్‌ (42-57 ఏళ్లు), 5 శాతం మంది బేబీ బూమర్స్‌ (58-76 ఏళ్లు) ఉన్నారు.

మిల్లీనియల్స్‌ లో దాదాపు 37 శాతం మంది తాము ఉద్యోగం మారడం దాదాపు ఖాయమని అభిప్రాయపడ్డారు. అదే జనరేషన్‌ జెడ్‌, జనరేషన్‌ ఎక్స్‌లో ఇది వరుసగా 33 శాతం, 29 శాతంగా ఉంది.

ఉద్యోగం మారడంతో పాటు వేతనం పెంచడం లేదా ప్రమోషన్‌ కోరుకుంటున్నట్లు మిల్లీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ అభిప్రాయపడ్డారు.

భారత్‌లో వచ్చే ఏడాదిలో దాదాపు 59 శాతం మంది ఉద్యోగులు ప్రమోషన్‌ కోసం అభ్యర్థించనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 30 శాతంగా ఉంది.

కొత్త ఉద్యోగానికి మారడం అంటే ప్రస్తుతం చేస్తున్న కంపెనీలో పనివాతావరణం సరిగా లేదనే అర్థంలో తీసుకోవద్దని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

59 శాతం మిల్లీనియల్స్‌, 50 శాతం జనరేషన్‌ జెడ్‌ ఉద్యోగులు తమకు భద్రతతో కూడిన పనిప్రదేశం కావాలని కోరారు. మంచి వేతనం, మెరుగైన భవిష్యత్తు, సౌకర్యవంతమైన పనివాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.

చాలా మంది ఇంకా ఆఫీసులకు రావడానికి ఇష్టపడడం లేదని సర్వేలో తేలింది. తమకు ‘ఇంటి నుంచి పనిచేయడం’ లేదా ‘హైబ్రిడ్‌ పనితీరే’ సౌకర్యంగా ఉందని తెలిపారు. దాదాపు 81 శాతం మంది తాము చేసే ఉద్యోగం ఎక్కడి నుంచైనా చేయగలిగే పని అని పేర్కొన్నారు.

 54 శాతం మంది భారత్‌లో నైపుణ్యాల కొరత ఉందని అంగీకరించారు. అలాగే 67 శాతం మంది తాము చేస్తున్న ఉద్యోగానికి ప్రత్యేక శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.

  సీఈఓ, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో నైపుణ్యాల కొరత అధికంగా ఉందని సర్వేలో తేలింది. ఆ కేటగిరీలోకి వచ్చే వారికి కొత్త నైపుణ్యాలు అలవర్చుకునేందుకు, సహచరులతో కలిసి పనిచేసేందుకు అవకాశం లభించడం లేదని తెలిపింది.

తాము పనిచేస్తున్న సంస్థలు తమ భవిష్యత్తుకు సరిపడా నైపుణ్యాలను అందించడం లేదని సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఉద్యోగులు వెల్లడించారు. నైపుణ్యాల కొరతను అధిగమించేందుకు వేతనాల పెంపు, ఆటోమేషన్‌ వంటి మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని