Audi India: అమ్మకాల్లో ఆడి ఇండియా జోరు.. తొలి త్రైమాసికంలో 126 % వృద్ధి

ఆడి ఇండియా (Audi India) ఈ ఏడాది తొలి త్రైమాసికం అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసింది. ఆడి ఎస్‌యూవీ కార్లకు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, ఈ అమ్మకాల జోరును ఏడాది మొత్తం కొనసాగిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. 

Published : 20 Apr 2023 23:04 IST

ముంబయి: ఆడి ఇండియా (Audi India) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గణనీయమైన లాభాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. 126 శాతం అమ్మకాల పెరుగుదలతో గత ఆరేళ్లలో తొలి త్రైమాసికంలో ఇంతవరకు నమోదు కానీ వృద్ధిని ఈసారి సాధించినట్లు తెలిపింది. 2023 సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ఆడి ఇండియా వెల్లడించింది. గతేడాది తొలి త్రైమాసికంలో 862 కార్లను డెలివరీ చేయగా, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 1,950 కార్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. 

‘‘2023 తొలి త్రైమాసికంలో 126 శాతం వృద్ధి రేటును నమోదు చేశాం. ప్రస్తుతం ఆడి ఇండియా వాహన శ్రేణిలో 16 మోడల్స్‌ ఉన్నాయి. ఆడి కార్ల అమ్మకాల్లో 60 శాతం వాటాతో ఎస్‌యూవీ (SUV) మోడల్స్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఆడి క్యూ3 (Audi Q3), ఆడి క్యూ3 స్పోర్ట్స్‌ బ్యాక్‌ మోడల్స్‌కు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ అమ్మకాల జోరును ఏడాది మొత్తం కొనసాగిస్తాం’’ అని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ ధీమా వ్యక్తం చేశారు. 

ఆడి అప్రూవ్డ్‌: ప్లస్‌ ఇన్‌ ఇండియా (Audi Approved: Plus in India) పేరుతో సెకండ్‌ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలకు సిద్ధం చేసినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆడి అప్రూవ్డ్‌ షోరూమ్‌లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 25 ఆడి అప్రూవ్డ్‌ షోరూమ్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని