Audi price hike: కొత్త ఏడాదిలో ‘ఆడీ’ కార్లు మరింత ప్రియం

Audi price hike: కార్ల ధరల్ని పెంచనున్నట్లు ఆడీ ఇండియా ప్రకటించింది. వ్యయాలు పెరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 

Published : 07 Dec 2022 17:43 IST

దిల్లీ: కొత్త సంవత్సరంలో ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో ఆడీ కూడా చేరింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా 1.7 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. 2023 జనవరి 1 నుంచి కొత్త ధరలు అందుబాటులో వస్తాయని పేర్కొంది. నిర్వహణ, సహా ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. సరఫరా వ్యవస్థలో ఏర్పడ్డ అంతరాయాలు ఇంకా కొనసాగుతున్నాయని.. దాని వల్లే వ్యయాలు భారంగా మారుతున్నాయని పేర్కొంది.

ఆడీ ఇండియా ప్రస్తుతం భారత్‌లో ఏ4, ఏ6, ఏ8 ఎల్‌, క్యూ3, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌, ఆర్‌ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌, ఆర్‌ఎస్‌క్యూ8 మోడల్‌ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్‌ బ్రాండ్‌ పేరిట ఇ-ట్రాన్‌ 50, ఇ-ట్రాన్‌ 55, ఇ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ 55, ఇ-ట్రాన్‌ జీటీ, ఆర్‌ఎస్‌ ఇ-ట్రాన్‌ జీటీ విద్యుత్తు కార్లూ అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల నుంచి కార్ల ధరల్ని పెంచుతామని ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ ప్రకటించాయి.

రెనో కార్లూ పెరగనున్నాయ్‌..

కార్ల తయారీ సంస్థ రెనో (Renault India) సైతం ధరల పెంపును (Price hike) ప్రకటించింది. జనవరి నుంచి అన్ని మోడళ్లపైనా ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ఎంతమొత్తం పెంచేదీ మాత్రం వెల్లడించలేదు. అధిక ముడిసరకు ధరల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడం, విదేశీ మారకం రేట్లలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఆ కంపెనీ క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ పేరిట రూ.4.64 లక్షల నుంచి రూ.10.62 లక్షల ధరల శ్రేణిలో వాహనాలను విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని