కొంచెం చూసి పన్నేయండి..!

ఏడాదిన్నర తర్వాత ఆటోమొబైల్‌ పరిశ్రమ ఇప్పుడిప్పుడే  పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో తీసుకొనే నిర్ణయాలు ఈ పరిశ్రమ భవిష్యత్తును నిర్దేశించనుంది

Updated : 30 Jan 2021 19:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఏడాదిన్నర తర్వాత ఆటోమొబైల్‌ పరిశ్రమ ఇప్పుడిప్పుడే  పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో తీసుకొనే నిర్ణయాలు ఈ పరిశ్రమ భవిష్యత్తును నిర్దేశించనుంది. వాస్తవానికి గత బడ్జెట్‌లో ఆటోమొబైల్‌ పరిశ్రమకు నిరాశ ఎదురైంది.  ముఖ్యంగా దేశీయ తయారీకి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు రాలేదని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లాక్‌డౌన్‌  రావడంతో కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమ మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌(ఎఫ్‌ఏడీఏ) ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. 

కార్పొరేట్‌ పన్ను లబ్ధి..

ప్రభుత్వం గతేడాది రూ.400 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న కంపెనీలపై కార్పొరేట్‌ పన్నును 25శాతానికి తగ్గించింది.  ఈ లబ్ధిని అన్ని రకాల ప్రొప్రైటరీ, భాగస్వామ్య సంస్థలకు కూడా వర్తింపజేయాలని కోరింది. ఆటోమొబైల్‌ డీలర్‌షిప్‌లో అధికభాగం వీటి కిందకే వస్తాయి. 

టీసీఎస్‌లో కొంత మినహాయిపు 

2020 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం టాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌ కింద ఆటో డీలర్స్‌ నుంచి 0.1శాతం వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది గత అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చింది. ఇది రిటైల్‌ వర్గాలకు భారంగా పరిణమించింది. డీలర్స్‌ రీఫండ్‌ పొందే వరకు వారి వర్కింగ్‌ క్యాపిటల్‌ నిలిచిపోతుంది. 

వాహన తుక్కు విధానాన్ని ప్రోత్సహించాలి

ప్రస్తుతం ప్రభుత్వం వాహన సర్టిఫికేషన్‌ విధానాన్ని తీసుకురావడం గానీ, లేదా వాహనాలకు వాటికి ఇచ్చిన జీవన కాలం వరకు మాత్రమే వినియోగించేలా చూడటం కానీ చేయాలి. కాకపోతే పై రెండు విధానాలు అమలు చేయడానికి చాలా సమయం పడుతుంది. పాత వాహనాలను స్వచ్ఛందగా తుక్కుగా మార్చి కొత్త వాహనాలు తీసుకున్న యజమానులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 

కార్ల తయారీదారులు ఏమంటున్నారంటే..

ప్రభుత్వం కీలకమైన పన్నుల్లో మినహాయింపులు ఇస్తే ఆటోమొబైల్‌ పరిశ్రమ కోలుకుంటుందని ఉత్పత్తి దారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ ధరల్లో తగ్గించాలని కోరుతున్నారు. ఇక సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, అసెంబ్లింగ్‌ యూనిట్ల ఏర్పాటకు విదేశీ పెట్టుబడులు వచ్చే పాలసీలు ప్రకటించాలని కోరుతున్నారు.

*  బీఎస్‌6 వాహనాలు  రావడంతో  ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ తగ్గిస్తే కొంచెం ఉపశమనం లభించి విక్రయాలు పెరుగుతాయని ఆశించారు. కానీ, వారు ఆశించిన నిర్ణయం వెలువడలేదు. 

* విద్యుత్తు కార్లను ప్రోత్సహిస్తుండటంతో లిథియం అయాన్‌ బ్యాటరీల తయరీదారులు 5శాతం కస్టమ్‌ డ్యూటీని తగ్గించాలని కోరుతున్నారు. 

ఇవీ చదవండి

పురపాలనకు బలం..

నీకు వాటా కావాలా..? సిద్ధంగా ఉండు..!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని