రోడ్డు ప్రమాదాలపై ఆందోళన.. ఆటోమొబైల్‌ కంపెనీలకు గడ్కరీ కీలక సూచన

Nithin Gadkari: వాహనాల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని ఆటోమొబైల్‌ కంపెనీలకు నితిన్‌ గడ్కరీ సూచించారు. ఈ విషయంలో స్వతహాగా ముందుకు రావాలన్నారు.

Published : 12 Jan 2023 18:27 IST

గ్రేటర్‌ నొయిడా: ఆటోమొబైల్‌ కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin Gadkari) కీలక సూచన చేశారు. రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి తయారీ కంపెనీలు తమ వంతు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా వాహనాల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని సూచించారు. ఇక్కడ జరుగుతున్న ఆటోఎక్స్‌పో కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు.

2024 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం మేర తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా నిబంధనను తప్పనిసరి చేయకముందే కంపెనీలే సుమోటోగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో భారత ఆటోమొబైల్‌ రంగాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని చెప్పారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదాలనూ తగ్గించాల్సిన బాధ్యతా తమపై ఉందన్నారు. 

ముఖ్యంగా 18-34 మధ్య వయసు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి వాహనాల్లో భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు వాహన తయారీ కంపెనీలు కృషి చేయాలన్నారు. ఇది కొంచెం కష్టమే అయినా నూరు శాతం అసాధ్యమైతే కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుక్కు విధానంపైనా గడ్కరీ మాట్లాడారు. స్క్రాపింగ్‌ పాలసీ వల్ల విక్రయాలు 24 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. స్క్రాపింగ్‌ సర్టిఫికెట్‌తో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు డిస్కౌంట్లు ఇవ్వాలని సూచించారు. తమ వంతుగా డిస్కౌంట్‌ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇథనాల్‌ దిగుమతికి ఆ రెండు దేశాల ఆసక్తి

భారతదేశం నుంచి ఇథనాల్‌ను దిగుమతి చేసుకొనేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతున్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో రెండు దేశాల ప్రధానులతో చర్చలు జరిపినట్లు మరో సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. తమ దేశంలోనూ పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేందుకు భారత్‌ నుంచి ఇథనాల్‌ను దిగుమతి చేసుకునేందుకు ఆ రెండు దేశాలు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పారు. అలాగే, ఇథనాల్‌ పంపుల ఏర్పాటుపై త్వరలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో చర్చించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని