Automobile sales: వాహన రిటైల్‌ విక్రయాల్లో 8 శాతం క్షీణత

జులైలో దేశీయ వాహన రిటైల్‌ విక్రయాలు 8 శాతం తగ్గాయి. ట్రాక్టర్లు, ప్రయాణికుల, ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లలో పడిపోవడమే దీనికి కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది....

Updated : 04 Aug 2022 14:11 IST

దిల్లీ: జులైలో దేశీయ వాహన రిటైల్‌ విక్రయాలు 8 శాతం తగ్గాయి. ట్రాక్టర్లు, ప్రయాణికుల, ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు పడిపోవడమే దీనికి కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. జులైలో దేశవ్యాప్తంగా 14,36,927 వాహన విక్రయాలు నమోదయ్యాయి. 2021 జులైలో నమోదైన 15,59,106తో పోలిస్తే ఈసారి 8 శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 

ప్రయాణికుల వాహన విక్రయాలు 5 శాతం తగ్గి 2,50,972 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఈ సంఖ్య 2,63,238గా ఉంది. ఈ విభాగంలో విక్రయాలు తగ్గినప్పటికీ.. కొత్త మోడళ్లు ముఖ్యంగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విడుదల పెరగడం రానున్న రోజుల్లో విక్రయాల వృద్ధికి ఊతమివ్వనుందని ఫాడా అధ్యక్షుడు వింకేశ్‌ గులాటీ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సరఫరా సమస్యలు కూడా తీరనున్నాయని తెలిపారు.

అదే సమయంలో ద్విచక్ర వాహన విక్రయాలు 2021 జులైలో నమోదైన 11,33,344 యూనిట్లతో పోలిస్తే 11 శాతం తగ్గి 10,09,574 యూనిట్లుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ తగ్గడమే ద్విచక్ర వాహన సెగ్మెంట్‌లో విక్రయాల పతనానికి ప్రధాన కారణమని వింకేశ్‌ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వాతావరణం, ధరలు పెరగడం కూడా విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వెల్లడించారు.

ట్రాక్టర్ల విక్రయాలు సైతం 82,419 యూనిట్ల నుంచి 28 శాతం తగ్గి 59,573 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో మాత్రం 80 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. ఏడాది క్రితం 27,908 వాహనాలు అమ్మగా.. ఈసారి అవి 50,349 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహన విక్రయాలు సైతం 27 శాతం పెరిగాయి. క్రితం ఏడాది జులైలో 52,197 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి ఆ సంఖ్య 52,197 యూనిట్లకు చేరింది. ఒకవేళ తైవాన్‌-చైనా ఉద్రిక్తతలు ముదిరితే.. సెమీకండక్టర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని గులాటీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని