Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్‌ విక్రయాల్లో 11% వృద్ధి

పండగ సీజన్‌ నేపథ్యంలో సెప్టెంబరులో వాహన రిటైల్‌ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబరులో మరింత పుంజుకునే అవకాశం ఉందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది.

Published : 04 Oct 2022 15:34 IST

దిల్లీ: సెప్టెంబరులో దేశీయంగా వాహనాల రిటైల్‌ విక్రయాలు 11 శాతం వృద్ధి చెందాయి. పండగ సీజన్‌ నేపథ్యంలో తయారీ కంపెనీల నుంచి వాహన సరఫరా పెరిగిందని.. ఫలితంగా వినియోగదారులకు డీలర్లు ఎక్కువ సంఖ్యలో కార్లను అందజేయగలిగారని వాహన డీలర్ల సమాఖ్య ‘ఫాడా’ వెల్లడించింది. అక్టోబరులో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత దశాబ్ద కాలంలో ప్రయాణికుల వాహన విభాగంలో ఈ ఏడాదే మెరుగైన విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని డీలర్లు తెలిపారు. ట్రాక్టర్లు, కొన్ని త్రిచక్ర వాహన వేరియంట్లు మినహా ప్రయాణ, వాణిజ్య, ద్విచక్ర వాహన విక్రయాల్లో క్రితం ఏడాదితో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది.

ఫాడా గణాంకాల ప్రకారం.. మొత్తం వాహనాల రిటైల్‌ విక్రయాలు 2021 సెప్టెంబరులో 13,19,647 కాగా, గత నెలలో 14,64,001కు చేరాయి. ప్రయాణికుల వాహన విక్రయాలు 2,37,502 నుంచి 10 శాతం పెరిగి 2,60,556గా నమోదయ్యాయి. పండగ సీజన్‌లో కొత్త వాహనాలను సొంతం చేసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. మరోవైపు సెమీకండక్టర్ల సరఫరా కూడా మెరుగుపడడంతో తయారీలోనూ ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. అలాగే అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న కార్ల విడుదల పెరగడం కూడా విక్రయాల్లో వృద్ధికి దోహదం చేసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని