ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ లో పెరిగిన చందాదారుల సంఖ్య‌

2021-22లో నెల‌కీ స‌గ‌టున 12.4 ల‌క్ష‌ల మంది చందాదారులు `ఈఎస్ఐ`లో చేరారు.

Published : 28 Jun 2022 12:17 IST

సంఘ‌టిత రంగంలో కార్మికుల‌కు ఆరోగ్య సేవ‌ల‌ను, కార్మికుల చ‌ట్టాన్ని అనుస‌రించి కొన్ని వ‌ర్గాలకు ఆర్ధిక స‌హాయాన్ని అందించే `ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ)లో ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.60 ల‌క్ష‌ల మంది కొత్త చందాదారులు చేరారు. స్టాటిస్టిక్స్‌, ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేష‌న్ మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్‌పీఐ)  `ఈఎస్ఐసీ`, ఉద్యోగుల‌తో స‌హా ప్ర‌ధాన ప‌థ‌కాల కింద చందాదారుల సంఖ్య‌పై స‌మాచారాన్ని ఉప‌యోగించి సెప్టెంబ‌ర్ 2017 నుండి అధికారిక రంగంలో ఉపాధి సంబంధిత గ‌ణాంకాల‌ను ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ) ఒక చోట చేరుస్తుంది. `ఈఎస్ఐసీ`లో స‌భ్య‌త్వం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి కూడా `ఈపీఎఫ్ఓ`లో కూడా స‌భ్య‌త్వం ఉండే అవ‌కాశం ఉంది. ఈ ఏప్రిల్‌లో `ఈపీఎఫ్ఓ` నిర్వ‌హించే సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాల్లో 9.20 ల‌క్ష‌ల మంది కొంత చందాదారులు చేరారు.

కోవిడ్‌కు ముందు సంవ‌త్స‌రం 2019-20 చేరిన కొత్త చందాదారుల నెల‌వారీ స‌గ‌టు మాదిరిగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.6 ల‌క్ష‌ల మంది `ఈఎస్ఐ`లో చేరారు. నెల‌కు రూ. 21,000 వ‌ర‌కు సంపాదిస్తున్న 10 లేదా అంత‌కంటే ఎక్కువ మంది వ్య‌క్తులు ప‌నిచేస్తున్న అన్ని కార్మాగారాలు, ఇత‌ర సంస్థ‌ల ఉద్యోగుల‌కు `ఈఎస్ఐ` వ‌ర్తిస్తుంది. 1948 ఈఎస్ఐ చ‌ట్టం ప్ర‌కారం అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు ఈఎస్ఐ సేవ‌లు వ‌ర్తించ‌వు. ఈఎస్ఐ ప‌థ‌కంలో యజ‌మాని త‌న వాటా కింద‌.. వేత‌నంలో 3.25%, ఉద్యోగి త‌న వాటా కింద వేత‌నంలో 0.75%  ఆదాయాన్ని `ఈఎస్ఐసీ`కి చెల్లించాల్సి ఉంది.

2019-20లో ఒక నెల‌కి స‌గ‌టున‌ 12.60 ల‌క్ష‌ల మంది `ఈఎస్ఐ` ప‌థ‌కంలో చందాదారులుగా చేరారు. అయితే 2020-21లో కోవిడ్‌ ప్ర‌భావం చేత ఈఎస్ఐ చందాదారులుగా చేరే నెల‌వారీ స‌గ‌టు 9.60 ల‌క్ష‌ల‌కి ప‌డిపోయింది. 2వ వేవ్ కొన‌సాగుతున్న సంవ‌త్స‌రం 2021-22లో నెల‌కి స‌గ‌టున 12.40 ల‌క్ష‌ల మంది చందాదారులు `ఈఎస్ఐ`లో చేరారు

ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాల‌ సృష్టి బాగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. సెప్టెంబ‌ర్ 2017 - ఏప్రిల్ 2022 మ‌ధ్య కాలంలో మొత్తం 6.60 కోట్ల కొత్త చందాదారులు `ఈఎస్ఐ` ప‌థ‌కంలో చందాదారులుగా చేరారు. ఇదే కాలంలో దాదాపు 5.40 కోట్ల మంది కొత్త చందాదారులు `ఈపీఎఫ్ఓ`లో చేరారు. `ఈఎస్ఐ` స‌భ్య‌త్వ‌మున్న కార్మికుల‌కు ఆరోగ్య సేవ‌లు, ఆర్ధిక స‌హాయాన్ని ఎలా అందిస్తుందో, `ఈపీఎఫ్ఓ` కూడా త‌న చందాదారుల‌కు ప్ర‌భుత్వ రంగాన ఏ ఆర్ధిక సంస్థ ఇవ్వ‌నంత వ‌డ్డీ రేటును అందిస్తుంది. ప్ర‌స్తుతం 8.1% వ‌డ్డీ రేటును `ఈపీఎఫ్ఓ` అందిస్తుంది. అంతేకాకుండా `ఈపీఎఫ్ఓ` చందాదారులు తాము జ‌మ చేసిన ఫండ్ నుండి రుణాల్ని కూడా తీసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని