డిపాజిట్ల‌పై టీడీఎస్ పడకుండా చూస్కోండి!

మీ డ‌బ్బుని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, వీటిపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం పై మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌) ప‌డ‌కుండా ఉండాలని భావిస్తున్నారా? అయితే కొన్ని అర్హ‌త‌లు, ష‌ర‌తుల‌కు లోబ‌డి ఫారం-15 జీ లేదా ఫారం-15 హెచ్‌ని స‌మ‌ర్పించిన‌ట్ల‌యితే టీడీఎస్ భారం ప‌డ‌కుండా నివారించ‌వ‌చ్చు. దేశంలో అతి పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై టీడీఎస్ భారం ప‌డ‌కుండా..

Published : 16 Dec 2020 16:21 IST

మీ డ‌బ్బుని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, వీటిపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం పై మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌) ప‌డ‌కుండా ఉండాలని భావిస్తున్నారా? అయితే కొన్ని అర్హ‌త‌లు, ష‌ర‌తుల‌కు లోబ‌డి ఫారం-15 జీ లేదా ఫారం-15 హెచ్‌ని స‌మ‌ర్పించిన‌ట్ల‌యితే టీడీఎస్ భారం ప‌డ‌కుండా నివారించ‌వ‌చ్చు. దేశంలో అతి పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై టీడీఎస్ భారం ప‌డ‌కుండా ఉండేందుకు ఫారం-15జీ/ హెచ్‌ని స‌మ‌ర్పించాల్సిందిగా త‌మ వినియోగ‌దారుల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో కోరింది. ప్ర‌తీ ఆర్థిక సంవ‌త్స‌రంలో లేదా కొత్త ట‌ర్మ్ డిపాజిట్లను ప్రారంభించేట‌ప్పుడు లేదా మెచ్యూరిటీ ముగియ‌క‌ముందే ట‌ర్మ్ డిపాజిట్ల‌ను ముగించే స‌మ‌యంలో దీనిని త‌ప్ప‌క స‌మ‌ర్పించాలని కోరింది. మీ ఖాతా ఉన్న శాఖ‌ల‌లో లేదా ఆన్‌లైన్‌లో దీనిని స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని తెలిపింది. పైన తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఎస్‌బీఐ లేదా ఇత‌ర ఏ బ్యాంకైనా మీ డిపాజిట్ల వ‌డ్డీ ఆదాయంపై టీడీఎస్ వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని కోరుకుంటున్న‌ట్ల‌యితే మీరు త‌ప్ప‌కుండా ఫారం-15 జీ లేదా హెచ్‌ని స‌మ‌ర్పించాల్సిందే. అయితే వీటికి కొన్ని నియ‌మ నిబంధ‌న‌లున్నాయి. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో మీ డిపాజిట్ల‌పై వ‌చ్చిన వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు మించిన‌ట్ల‌యితే మీరు టీడీఎస్ మిన‌హాయింపును పొందేందుకు అన‌ర్హులు. అన్ని శాఖ‌ల ఖాతాల‌లోని డిపాజిట్ల‌పై వ‌చ్చిన ఆదాయాన్ని లెక్కించి ఈ ప‌రిమితిని బ్యాంకులు నిర్ణ‌యిస్తాయి.

ఒక వేళ మీ వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు (60 ఏళ్ళు మించితే రూ. 50,000) లేదా అంత‌ కంటే తక్కువ ఉన్న‌ట్ల‌యితే మీ వయ‌సు, ఆదాయ వివ‌రాల‌ననుస‌రించి ఫారం-15 స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. భార‌తీయ పౌర‌స‌త్వం క‌లిగి 60 ఏళ్లలోపు ఉన్న‌వారు ఫారం-15 జీ ని స‌మ‌ర్పించాలి. 60 ఏళ్లు మించిన వారు ఫారం-15 హెచ్ ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప‌న్ను బకాయిలేమీ లేకుండా, శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్‌)ను స‌మ‌ర్పించిన‌ప్పుడే మీ వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటారన్న విషయాన్నీ మ‌ర్చిపోవ‌ద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని