PAN: మీకు తెలుసా?.. పాన్‌ విషయంలో ఈ తప్పులకు ₹10 వేల ఫైన్‌!

PAN CARD: మన నిత్య జీవితంలో భాగమైపోయిన పాన్‌ను వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. లేదంటే రూ.10వేలు జరిమానా పడే అవకాశం ఉంటుంది.

Updated : 20 Dec 2022 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్తగా బైక్‌ కొనాలన్నా.. ఏదైనా ఆస్తి కొనాలన్నా/ అమ్మాలన్నా పాన్‌ (PAN) అవసరం. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. రూ.50వేలు మించి చేసే లావాదేవీలకూ శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి. ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా పాన్‌ కార్డు సుపరిచితమే. అయితే, పాన్‌ కార్డు విషయంలో ఈ పొరపాట్లు చేస్తే మాత్రం భారీ జరిమానా చెల్లించాలని మీకు తెలుసా? అయితే ఈ విషయం గుర్తుంచుకోండి. పాన్‌కు సంబంధించి తప్పుడు వివరాలు ఇవ్వడం, రెండేసి కార్డులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. అందుకు రూ.10వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఐటీ చట్టం, 1961లోని సెక్షన్‌ 272B ప్రకారం.. ఎవరైనా సరే తప్పుడు పాన్‌ వివరాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఇందుకు రూ.10వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఐటీ రిటర్నులు దాఖలు, పాన్‌ వివరాలు ఇవ్వాల్సిన ఇతర చోట్లా.. తప్పుడు వివరాలు ఇవ్వడం నేరం. కాబట్టి అంకెలు, సంఖ్యలతో కూడిన పాన్‌ నంబర్‌ను తప్పుగా రాయకుండా చూసుకోండి. పాన్‌ వివరాలు నింపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పాన్‌ కార్డుపై మొద‌టి ఐదు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అంకెలు, చివర్లో మళ్లీ ఆంగ్ల అక్షరం ఉంటుందని గుర్తుంచుకోండి. ఎక్కువ మంది సున్నా, ఓ (ఆంగ్ల అక్షరం) ఉన్న చోట గుర్తించే క్రమంలో తడబాటుపడుతుంటారు.

రెండు కార్డులున్నాయా?

ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి రెండు పాన్‌కార్డులు కలిగి ఉండటం కూడా చట్టరీత్యా నేరమే. ఆదాయ పన్ను దర్యాప్తులో మీ వద్ద రెండు పాన్‌లు ఉన్నట్లు తేలితే భారీ జరిమానా చెల్లించక తప్పదు. అంతేకాకుండా అధికారులు మీ బ్యాంక్‌ ఖాతాను స్థంభింప చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీ వద్ద రెండు పాన్‌కార్టులు కలిగి ఉంటే వెంటనే వెనక్కి ఇచ్చేయండి. ఒక వ్యక్తికి రెండు పాన్‌ కార్డుల ఎలా ఉంటాయనే సందేహం మీకు రావొచ్చు! చాలా మంది పాన్‌కార్డులో ఏదైనా తప్పులు (కరెక్షన్‌లు) ఉంటే దాన్ని సరిదిద్దుకోకుండా కొత్త దాని కోసం అప్లయ్‌ చేస్తుంటారు. ఇది ఓ రకంగా రెండు పాన్‌ నంబర్లు కలిగి ఉండడానికి దోహదం చేస్తుంది. కార్డు కోసం అప్లయ్‌ చేసినా కొన్ని సందర్భాల్లో వచ్చి ఉండవు. దీంతో కొందరు మళ్లీ అప్లయ్‌ చేస్తుంటారు. కాబట్టి కొత్త పాన్‌ అప్లయ్‌ చేసే ముందు పాన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం మంచింది. మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఇంటి పేరు మార్పులో భాగంగా కొత్త పాన్‌ కోసం దరఖాస్తు చేస్తారు. అయితే, పెళ్లి చేసుకున్నాక పాన్‌కార్డులో కరెక్షన్‌లను సరిచేసుకుంటే సరిపోతుంది.

ఇలా వెనక్కి ఇచ్చేయండి..

అఫ్‌లైన్‌లో పాన్‌కార్డు తొలగించడం కోసం ముందుగా మీరు ఫామ్‌ 49Aలో మీ సమాచారం నింపాల్సి ఉంటుంది. అనంతరం దగ్గరలోని  ఎన్‌సీడీసీఎల్‌ కేంద్రానికి వెళ్లి మీ వివరాలు సమర్పించాలి. అక్కడ పాన్‌కార్డుతో పాటు అధికారులు అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందుగా ఆదాయ పన్ను శాఖ సంబంధిత అధికారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఆపై డూప్లికేట్‌ పాన్‌ సమర్పించినట్లు రసీదు తీసుకోండి. ఆన్‌లైన్‌లో అయితే మీరు పాన్‌ సర్వీసు పోర్టల్‌లోకి వెళ్లి ‘Change or Correction’పై క్లిక్‌ చేయండి. ఇక్కడ మీ పూర్తి వివరాలు ఎంటర్‌ చేసి పాన్‌కార్డును అప్‌డేట్‌ చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు