SIP Investments: మీరు ఈ తప్పులు చేస్తున్నారా? ఒకసారి చెక్‌చేయండి

తప్పులు లేకుండా చివరి వరకు కొనసాగించినప్పుడు మాత్రమే సిప్‌ పెట్టుబడులు మెరుగైన ఫలితాలు ఇస్తాయి.

Updated : 22 Feb 2023 12:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెలవారీగా పొదుపు చేస్తూ, పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌) మంచి మార్గం. క్రమశిక్షణతో, క్రమ పద్ధతిలో మదుపు చేస్తే సిప్‌ ద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. అయితే, చాలా మంది సిప్‌ను ప్రారంభిస్తారు, కానీ కొనసాగింపులో చేసే చిన్న చిన్న తప్పులు, పొరపాట్ల కారణంగా పెద్ద మొత్తంలో నిధిని కూడబెట్టడంలో విఫలమవుతుంటారు. అందువల్ల ముందుగా సిప్‌లో సాధారణంగా చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే..నివారించే ప్రయత్నం చేయవచ్చు. 

తప్పు: తక్కువగా పెట్టుబడి పెట్టడం

సిప్‌తో రూ.500 నుంచి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. చిన్న మొత్తాలను పొదుపు చేయగల మదుపర్లను పెట్టుబడుల వైపు ప్రోత్సహించేందుకు ఈ అవకాశం కల్పించారు. అయితే కొంత మంది తమ ఆర్థిక లక్ష్యాలతో సంబంధం లేకుండా కనీస లేదా తక్కువ మొత్తంలో సిప్‌ చేస్తున్నారు. ఇదే చివరి వరకు కొనసాగిస్తే లక్ష్యానికి తగిన డబ్బు సమకూరదు. 

ఏం చేయాలి?
ఆదాయం తక్కువ ఉన్న వారు తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంలో తప్పులేదు. కానీ, పెట్టుబడులు ఎప్పుడూ లక్ష్యానికి తగినట్లే ఉండాలని గుర్తుంచుకోండి. ఉదాహరణకి, మీకు 20 ఏళ్ల తర్వాత రూ.50 లక్షలు కావాలి. ఇందుకోసం సిప్‌ ద్వారా నెలకు రూ.5000 పెట్టుబడి పెడితే 12% రాబడి అంచనాతో 20 ఏళ్లలో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలా కాక నెలకు రూ.2000 మాత్రమే మదుపు చేస్తే..20 ఏళ్లలో రూ.20 లక్షలు మాత్రమే సమకూర్చుకోగలరు. ఇది మీ లక్ష్య సాధనకు ఏ మాత్రం సరిపోదు. కాబట్టి ముందుగా లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన మొత్తాన్ని(ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని) అంచనా వేసి తగిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టండి.

తప్పు: తక్కువ కాలవ్యవధితో ఈక్విటీల్లో సిప్‌ చేయడం.

కొంత మంది ఏడాది నుంచి మూడేళ్ల కాలవ్యవధికి సిప్‌ చేస్తుంటారు. అది కూడా అధిక నష్టభయం ఉండే ఈక్విటీలను ఎంచుకుంటారు. స్వల్ప కాలవ్యవధిలో మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి. కాబట్టి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించరు. 

ఏం చేయాలి?

దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసినప్పుడు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో నష్టభయం తగ్గి రాబడి పెరిగేందుకు అవకాశం ఉటుంది. కాబట్టి, అధిక మొత్తంలో సంపదను కూడబెట్టొచ్చు. స్వల్పకాలం కోసం స్థిరత్వంతో పాటు లిక్విడిటి అధికంగా ఉన్న లిక్విడ్‌ ఫండ్లు, డెట్‌ ఫండ్లను ఎంపిక చేసుకోవడం మేలు. 

తప్పు: మార్కెట్‌ అస్థిరతకు భయపడి సిప్‌ మధ్యలోనే నిలిపివేయడం

మార్కెట్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫండ్‌లో హెచ్చుతగ్గుల కారణంగా మదుపర్లు భయాందోళనలకు లోనవుతారు. ఫలితంగా సిప్‌ అకస్మాత్తుగా రద్దు చేసుకుంటారు. 

ఏం చేయాలి?
మార్కెట్‌లు పడినప్పుడు సిప్‌ను నిలిపివేసి డబ్బు వెనక్కి తీసుకోవడం మంచిది కాదు. నిజానికి ఈ సమయంలో మరింత పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. 

తప్పు: ప్రారంభంలో సిప్‌ మొత్తాన్నే చివరి వరకు కొనసాగించడం..

కొంత మంది సిప్‌ ప్రారంభ సమయంలో ఎంత మొత్తం అయితే పెట్టుబడి పెడుతున్నారో అదే మొత్తాన్ని చివరి వరకు కొనసాగిస్తారు. ఇది మంచిది కాదు. 

ఏం చేయాలి?
ప్రతి సంవత్సరం జీతం పెరుగుతుంది. పెరిగిన జీతంతో పాటు పొదుపు, పెట్టుబడులు పెరగాలి. అందువల్ల వార్షికంగా కొంత మొత్తాన్ని పెంచుకుంటూ ఉండడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతారు. 

తప్పు: పాజ్‌ చేయడం

ఆదాయం సరిపోవడం లేదని, ఏదైనా ఇతర కారణాల వల్ల డబ్బు కొరత ఏర్పడినప్పుడు..కొంత కాలం సిప్‌ని నిలిపి వేస్తుంటారు. దీని ప్రభావం కాలపరిమితి చివరి నాటికి తెలుస్తుంది. లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. 

ఏం చేయాలి?

సిప్‌ కొంత కాలం పాటు నిలిపి వేసి విరామం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు ఈ ఆప్షన్‌ వాడకుండా ఉండడం మంచిది. ఒకటి రెండు నెలలే కదా అనుకుంటాం. కానీ ఇది ఎన్ని నెలలు అవుతుందో చెప్పలేం. అలాగే ఒక్క నెల సిప్‌ను నిలిపి వేసినా దాని ప్రభావం చాలా ఉంటుంది. 

తప్పు: తరుచూ సమీక్షించడం, అస్సలు పట్టించుకోకపోవడం..

పెట్టుబడులు రోజూ సమీక్షించడం లేదా అస్సలు సమీక్షించకపోవడం రెండూ సరికావు. 

ఏం చేయాలి?
ఏడాదికి ఒకసారైనా పెట్టుబడులను సమీక్షించాలి. పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా మూల్యాంకనం చేయాలి. ఏడాది పాటు వేచి చూసినా ఫండ్‌ పనితీరు మెరుగుపడకపోతే వాటిని సమీక్షించి ఇతర ఫండ్లతో భర్తీ చేయాలి. 

చివరిగా..

సిప్‌ ద్వారా మదుపు చేయడం మంచి నిర్ణయమే. అయితే తప్పులు లేకుండా చివరి వరకు కొనసాగించినప్పుడు మాత్రమే మెరుగైన ఫలితాలు పొందే వీలుంటుంది. మీ లక్ష్యం, నష్ట భయాన్ని తట్టుకోగల సామర్థ్యం, కాలవ్యవధి వంటి వాటి ఆధారంగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసి మంచి రాబడి పొందొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని