AWS: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇండియా హెడ్‌ రాజీనామా

AWS:  క్లౌడ్‌ సేవల మౌలిక వసతులపై భారత్‌లో 2030 నాటికి 12 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలో ఏడబ్ల్యూఎస్‌ ఇండియా హెడ్‌ పునీత్‌ చండోక్‌ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Published : 02 Jun 2023 14:59 IST

దిల్లీ: ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (AWS)’ ఇండియా, సౌత్‌ ఏషియా హెడ్‌ పునీత్‌ చండోక్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంటర్‌ప్రైజెస్‌, మిడ్‌ మార్కెట్‌, గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ వైశాలి కస్తూరి తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నుంచి పునీత్‌ ఎప్పుడు వైదొలగనున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఏడబ్ల్యూఎస్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, కంపెనీ వర్గాలు పునీత్‌ రాజీనామాను ధ్రువీకరించినట్లు ‘టెక్‌ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ తెలిపింది.

లింక్డిన్‌లోని వివరాల ప్రకారం.. పునీత్‌ నాలుగేళ్ల క్రితం అమెజాన్‌లో చేరారు. కంపెనీలోని కీలక ఉన్నతోద్యోగులకు పునీత్‌ రాజీనామా గురించి మంగళవారమే సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆయన మరో సంస్థలో చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. భారత్‌లో క్లౌడ్‌ సేవలు వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. 2030 నాటికి క్లౌడ్‌ మౌలిక వసతుల ఏర్పాటు నిమిత్తం భారత్‌లో 12 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెజాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పునీత్‌ వైదొలగనుండటం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని