Baidu Apollo RT6: 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఇక్కడా..స్టీరింగ్‌ అక్కర్లేదు..బైడూ అత్యాధునిక కారు ఆవిష్కరణ

Baidu Apollo RT6: చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘బైడూ (Baidu)’ పూర్తిస్థాయి ఆటానమస్‌ వాహనం (Autonomous vehicle) అపోలో ఆర్‌టీ6 (Apollo RT6)ను గురువారం ఆవిష్కరించింది...

Updated : 21 Jul 2022 15:07 IST

బీజింగ్‌: చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘బైడూ (Baidu)’ పూర్తిస్థాయి ఆటానమస్‌ వాహనం (Autonomous vehicle) అపోలో ఆర్‌టీ6 (Apollo RT6)ను గురువారం ఆవిష్కరించింది. అసలు స్టీరింగ్‌ వీల్‌ లేని ఈ కారు ఆరో తరం అటానమస్ వాహనం (Autonomous vehicle)గా కంపెనీ పేర్కొంది. నగర వాతావరణానికి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. వచ్చే ఏడాది దీన్ని అందుబాటులోకి తేనున్నారు. తొలుత దీన్ని బైడూ (Baidu) రైడ్‌ సర్వీసు ‘అపోలో గో’లోకి ప్రవేశపెట్టనున్నారు.

అపోలో ఆర్‌టీ6 (Apollo RT6) ఒక్కో యూనిట్‌ ధర 37,000 డాలర్ల వరకు ఉంటుందని బైడూ తెలిపింది. ఈ వాహనంతో ప్రపంచవ్యాప్తంగా అటానమస్‌ వాహన వినియోగం పుంజుకుంటుందని బైడూ విశ్వాసం వ్యక్తం చేసింది. ఫలితంగా ప్రపంచాన్ని డ్రైవర్‌రహిత కార్లకు దగ్గర చేస్తుందని వ్యాఖ్యానించింది. ధర భారీగా తగ్గిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు తమకు అవకాశం ఏర్పడుతుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ట్యాక్సీకి చెల్లిస్తున్న ఛార్జీలు తమ ఆర్‌టీ6 వంటి రోబోట్యాక్సీలు అందుబాటులో వస్తే సగానికి తగ్గుతాయని పేర్కొంది.

స్టీరింగ్‌లేని కారణంగా ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటుందని బైడూ తెలిపింది. ఫలితంగా ప్రత్యేకమైన ఇంటీరియర్స్‌ను రూపొందించవచ్చని పేర్కొంది. అదనపు సీట్లు, వెండింగ్‌ మెషీన్లు, డెస్క్‌టాప్‌లు, గేమింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసుకోచ్చని వివరించింది. పూర్తిగా ఫ్లాట్‌ ఫ్లోర్‌, ఇంటెలిజెంట్‌ ఇంటరాక్షన్‌ సిస్టం ఆర్‌టీ6లో ప్రత్యేక ఆకర్షణ అని పేర్కొంది. బయట నుంచి చూసినా ఈ వాహనాన్ని చాలా కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. సన్‌రూఫ్‌పై సెన్సార్లు, ఇంటరాక్టివ్‌ లైట్లు, ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్ల వంటి ఫీచర్లు రైడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత ఆహ్లాదంగా మార్చనున్నట్లు పేర్కొంది.

అపోలో ఆర్‌టీ6ను బైడూ రూపొందించిన అత్యాధునిక అటానమస్‌ డ్రైవింగ్‌ సిస్టంతో అనుసంధానించారు. ఈ వ్యవస్థ కంప్యూటింగ్‌ పవర్‌ 1200 టాప్స్‌ (Trillions or Tera Operations per Second). వాహనం నిరంతరం నలువైపులా దృష్టి సారించేలా మొత్తం 38 సెన్సార్లను పొందుపరిచారు. వీటిలో 8 లైడార్లు, 12 కెమెరాలు ఉన్నాయి. బైడూకు చెందిన అటానమస్‌ వాహనాలు ఇప్పటి వరకు నడిపిన 32 మిలియన్‌ కిలోమీటర్ల రియల్‌ వరల్డ్‌ డేటాను ఆర్‌టీ6కు అనుసంధానించారు. ఈ వాహనానికి ‘20 ఏళ్ల నైపుణ్యం గల డ్రైవర్‌కు ఉన్న అనుభవం’ ఉంటుందని కంపెనీ తెలిపింది. 2020లో ‘అపోలో గో’ పేరిట రోబోట్యాక్సీలను ప్రారంభించిన బైడూ.. ఇప్పటి వరకు చైనాలో 10 నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని