Bajaj Auto: ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ రాక మరింత ఆలస్యం

Bajaj Auto: ఫస్ట్‌ సీఎన్‌జీ బైక్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న బైక్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌. బజాజ్‌ ఆటో తన తొలి జీఎన్‌జీ బైక్‌ విడుదల వాయిదా వేసింది.

Published : 13 Jun 2024 20:30 IST

Bajaj Auto | ఇంటర్నెట్‌డెస్క్‌: సీఎన్‌జీతో నడిచే కార్లను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలు ఆటోమొబైల్‌ సంస్థలు ఈ విభాగంలోకి అడుగుపెట్టేశాయి. అయితే సీఎన్‌జీతో నడిచే బైక్‌ ఎలా ఉంటుందో చూడాలని బైక్‌ ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి బ్యాడ్‌న్యూస్‌. ఈ నెలలో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను తీసుకొస్తామన్న బజాజ్‌ ఆటో (Bajaj Auto).. ఇప్పుడు బైక్‌ విడుదల కాస్త వాయిదా వేసింది.

దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో ప్రపంచంలోనే ఫస్ట్‌ సీఎన్‌జీ బైక్‌ని జూన్‌ 18న ఆవిష్కరించనున్నట్లు గతంలో పేర్కొంది. తాజగా దీని విడుదలను జులై17కి  మార్చింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. దీనికి గల కారణాలను ఆయన పేర్కొనలేదు. సీఎన్‌జీ, ఫ్లెక్స్‌ ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలపై వస్తువు, సేవల పన్ను (GST)ని తగ్గించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. ఇది జరిగిన మరుసటిరోజే బజాజ్‌ ఆటో నుంచి ఈ ప్రకటన రావటం గమనార్హం.

ట్రాయ్‌ కొత్త సిఫార్సులు.. ఫోన్‌ నంబర్‌కూ ఇక ఛార్జీ..?

భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (Siam) జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖను కోరింది. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల కోసమే ఈ అభ్యర్థన చేసింది. మరోవైపు ఉత్పత్తి వ్యయం కారణంగా సీఎన్‌జీతో రానున్న బైకులు.. పెట్రోల్‌తో నడిచే వాటికంటే ఎక్కువ ధర ఉండనున్నాయని కంపెనీ ఈడీ రాకేశ్‌ శర్మ గతంలో పేర్కొన్నారు. ఆ సమయంలోనే సీఎన్‌జీ వాహనాలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బజాజ్‌ తొలి సీఎన్‌జీ బైక్‌.. బ్రూజర్ 125 పేరిట రానున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ను మొదట మహారాష్ట్రలో ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని