Bajaj Auto Q2 results: ఎగుమతులపై ఎఫెక్ట్‌.. బజాజ్‌ ఆటో లాభంలో 16 శాతం క్షీణత

దేశీయ ఆటో మొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రూ.1719 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 14 Oct 2022 21:45 IST

దిల్లీ: దేశీయ ఆటో మొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj Auto) రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 results) ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రూ.1719 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2040 కోట్ల లాభంతో పోలిస్తే 16 శాతం మేర తగ్గడం గమనార్హం. విదేశాలకు ఎగుమతులు దాదాపు 25 శాతం మేర క్షీణించడం వల్ల కంపెనీ లాభాలపై ప్రభావం చూపింది.

సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.8762 కోట్ల నుంచి రూ.10,203 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. స్టాండలోన్‌ పద్ధతిలో గతేడాది రూ.1275 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.1530 కోట్లకు పెరిగింది. క్యూ2లో 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్ల వాహనాలను బజాజ్‌ ఆటో విక్రయించింది. ఇందులో దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కలిపి మొత్తం 6,94,375 యూనిట్లు విక్రయించింది. గతేడాది 5,32,216 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది 6,12,191 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది దాదాపు 25 శాతం మేర తగ్గి 4,56,637 యూనిట్లకు పరిమితమయ్యాయి. కొన్ని విదేశీ మార్కెట్లలో స్థూల ఆర్థిక సవాళ్లు ఎగుమతులపై ప్రభావం చూపాయి. బజాజ్‌ షేరు శుక్రవారం 1.01 శాతం క్షీణించి రూ.3,569 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని