Bajaj Auto: బజాజ్‌ ఆటోకు నైజీరియా ‘నోట్ల’ ట్రబుల్‌!

Bajaj Auto shares: బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నైజీరియాలో పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గించాలని ఆ కంపెనీ నిర్ణయించడమే ఇందుకు కారణం.

Updated : 27 Feb 2023 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj Auto) షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వాహన ఉత్పత్తిని తగ్గించాలని ఆ కంపెనీ నిర్ణయించడమే ఇందుకు కారణం. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు (Bajaj auto shares) దాదాపు 5 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో అస్థిర పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి.

అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో చలామణీలో ఉన్న 200, 500, 1000 నైరాల (నైజీరియా కరెన్సీ)ను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. పాత నోట్ల మార్పిడికి ప్రజలకు అవకాశం కల్పించింది. అయితే, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో బ్యాంకుల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల వాహన పరిశ్రమకు డిమాండ్‌ తగ్గింది. ఈ క్రమంలోనే బజాజ్‌ ఆటో తన ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. నైజీరియాకు బజాజ్‌ ఆటో భారీ సంఖ్యలో వాహనాలను ఎగుమతి చేస్తుంటుంది.

నైజీరియాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తన ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో ఉత్పత్తిని 25 శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మార్చి నెలలో 2.50-2.70 లక్షల యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొన్ని నెలలుగా సగటున ఆ కంపెనీ 3.38 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా.. మార్చి నెలకు నిర్దేశించుకున్న లక్ష్యం బజాజ్‌ ఆటో పూర్తి ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి సమానం కావడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం ఉదయం బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రూ.193.90 (5.04 శాతం) మేర క్షీణించి 3,656.05 వద్ద కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని