Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!

Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను బజాజ్‌ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్‌ లభిస్తుంది.  

Updated : 05 Jul 2024 19:45 IST

Bajaj CNG Bike | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ (CNG) బైక్‌ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj auto) శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్‌ 125 (Freedom 125) పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్‌ ట్యాంక్‌ను అమర్చారు. పెరిగిన పెట్రోల్‌ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్‌ ఊరటనిస్తుందని బజాజ్‌ ఆటో తెలిపింది. దీని ధర, మైలేజీ ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎయిర్‌టెల్‌ కస్టమర్ల డేటా లీక్‌?.. ఖండించిన టెలికాం సంస్థ

ఫ్రీడమ్‌ 125 బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్‌ (Freedom 125) డిస్క్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్‌ ఆటో పేర్కొంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌తో ఏడు రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుందని తెలిపింది. ఇందులో డిస్క్‌ ఎల్‌ఈడీ వేరియంట్‌ ధరను రూ.1.10 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ పేర్కొంది. డ్రమ్‌ ఎల్‌ఈడీ 1.05 లక్షలు, డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.95వేలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది. 

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఫ్రీడమ్‌ 125లో 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్‌, 2 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ ఉంటుంది. సీఎన్‌జీ 2 కేజీలకు 200 కిలోమీటర్లు, పెట్రోల్‌ రెండు లీటర్లకు 130 కిలోమీటర్లు (లీటర్‌కు 65 కి.మీ.) కలిపి 330 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఇంజిన్‌ 9.5 పీఎస్‌ పవర్‌, 9.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీపై టాప్‌స్పీడ్‌ గంటకు 90.5 కిలోమీటర్ల, పెట్రోల్‌పై టాప్‌ స్పీడ్‌ 93.4 కిలోమీటర్లు వెళుతుందని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ, పెట్రోల్‌ ట్యాంక్‌లను సీటు కింద అమర్చారు.

ఈ బైక్‌ 11 రకాల సేఫ్టీ టెస్టుల్లో పాస్‌ అయ్యిందని కంపెనీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సీఎన్‌జీ లీక్‌ కాకుండా భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సాధారణ పెట్రోల్‌ బైక్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్‌ ఖర్చుతో ఈ బైక్‌ నడుస్తుందని, కేవలం ఐదేళ్లలోనే రూ.75వేల వరకు దీంతో ఆదా చేసుకోవచ్చని బజాజ్‌ ఆటో పేర్కొంది. సీఎన్‌జీ, పెట్రోల్‌ మోడ్‌ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. బైక్‌ను ఆపకుండానే ఫ్యూయెల్‌ ఆప్షన్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. బ్లూటూత్‌ కనెక్టివిటీతో కన్సోల్‌, మోనో షాక్‌ సస్పెన్షన్‌, పొడవైన సీటుతో ఈ బైక్‌ వస్తోంది. ఎల్‌ఈడీ రౌండ్‌ హెడ్‌ల్యాప్‌ అమర్చారు. బైక్‌ బుకింగ్‌లు తమ వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయని పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్‌లో తక్షణమే తీసుకొస్తామని, ఇతర రాష్ట్రాల్లో దశలవారీగా ఈ బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు