Worlds First CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌

సీఎన్‌జీ ఇంధనంగా వినియోగించే మోటార్‌సైకిల్‌ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్‌ ఆటో ఆవిష్కరించింది.

Published : 06 Jul 2024 02:00 IST

విడుదల చేసిన బజాజ్‌ ఆటో 
ధర రూ.95,000 నుంచి 
కిలోమీటరు రవాణా వ్యయం రూపాయి

పుణె: సీఎన్‌జీ ఇంధనంగా వినియోగించే మోటార్‌సైకిల్‌ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్‌ ఆటో ఆవిష్కరించింది. ‘ఫ్రీడమ్‌ 125’గా వ్యవహరించే ఈ బైక్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. 3 వేరియంట్లలో లభించే ఈ బైక్‌ ధర రూ.95,000 (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమై రూ.1.10 లక్షల వరకు ఉండనుంది. 

పెట్రోల్‌తో కూడా నడుస్తుంది: దేశీయంగా సీఎన్‌జీ లభ్యత అన్ని ప్రాంతాల్లో లేనందున, పెట్రోల్‌తో కూడా నడిచేలా ఈ బైక్‌ను తీర్చిదిద్దారు. ఇందుకోసం ఈ బైక్‌కు 2 కిలోగ్రాముల సీఎన్‌జీ ట్యాంకుతో పాటు, 2 లీటర్ల పెట్రోలు ట్యాంకునూ అమర్చారు. 2 కిలో గ్రాముల సీఎన్‌జీ ఇంధనంతో 200 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. ఒకవేళ సీఎన్‌జీ ట్యాంకు ఖాళీ అయితే.. మరో ట్యాంకులోని పెట్రోలుతో 130 కిలోమీటర్ల వరకు బైక్‌ను నడిపించొచ్చు. పెట్రోలుతో మాత్రమే నడిచే ఇతర బైక్‌లతో పోలిస్తే, సీఎన్‌జీ వల్ల ఈ బైక్‌ ఇంధన ఖర్చు బాగా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. పెట్రోలుతో బైక్‌ నడిచేందుకు సగటున కి.మీకు రూ.2.25 ఖర్చు అవుతుండగా, సీఎన్‌జీతో బైక్‌ ప్రయాణానికి కి.మీకు అయ్యే వ్యయం రూ.1 అని పేర్కొంది. తొలి సీఎన్‌జీ బైకును తేవడంపై బజాజ్‌ ఆటో పరిశోధన- అభివృద్ధి విభాగాన్ని మంత్రి గడ్కరీ ప్రశంసించారు. 

జీఎస్‌టీ రేట్లను సమీక్షించాలి.. రాజీవ్‌ బజాజ్‌: స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలకు జీఎస్‌టీ రేట్లపై సమీక్ష జరపాలని ప్రభుత్వానికి బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ సూచించారు. విద్యుత్‌ వాహనాలకు జీఎస్‌టీని 5 శాతంగా నిర్ణయించి మంచి పని చేశారని, సీఎన్‌జీ వంటి ఇతర ఇంధనాల విషయంలోనూ ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు. విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహానికి సబ్సిడీలు అందిస్తున్న తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ద్విచక్ర వాహనాలకు 28% జీఎస్‌టీ అమలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని