Banking: బ్యాంకులందించే సేవల్లో వేటికి ఛార్జీలు ఉంటాయ్‌?

బ్యాంకులు ఏ సేవలను ఉచితంగా అందిస్తాయి? ఏ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి..తెలుసుకుందాం.

Published : 15 Dec 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు తమ కస్టమర్లకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ సేవలు అందిస్తున్నాయి. నగదు బదిలీ, చెక్‌ క్లియరెన్స్‌, ఏటీఎం విత్‌డ్రా, లావాదేవీల ఎస్సెమ్మెస్‌ సౌకర్యం వంటి పలు సేవలు అందిస్తున్నాయి. ఇందులో కొన్ని ఉచితం కాగా... మరికొన్నింటికి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని సేవలకు పరిమితిని విధిస్తున్నాయి. ఒకవేళ పరిమితి దాటితే ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ రోజుల్లో ఇంచుమించు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంటోంది. కాబట్టి బ్యాంకులు ఏ సేవలను ఉచితంగా అందిస్తాయి? ఏ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయనేది తెలుసుకోవడం ముఖ్యం.

కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే?

సాధారణంగా బేసిక్‌ పొదుపు ఖాతాలకు, సామాజిక భద్రత ప్రయోజనాలను అందించే పొదుపు ఖాతాలు, శాలరీ ఖాతాలు వంటి కొన్ని పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇతర పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఎంతనేది బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెట్రో, అర్బన్‌ బ్రాంచీలోని ఖాతాదారులు రూ.3000, సెమీ అర్బన్‌ బ్రాంచీలోని ఖాతాదారులు రూ.2000, రూరల్‌ బ్రాంచీలోని ఖాతాదారులు రూ.1000 కనీస నెలవారీ బ్యాలెన్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది.

నగదు లావాదేవీలు..

బ్యాంకులు పొదుపు ఖాతాలో నగదు లావాదేవీల సంఖ్యను నెలకు మూడు నుంచి ఐదు వరకు పరిమితం చేస్తున్నాయి. బ్యాంకు పేర్కొన్న సంఖ్య లేదా మొత్తం కంటే ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తే ఛార్జీలు వర్తిస్తాయి. కస్టమర్లు నగదు రహిత, డిజిటల్‌ లావాదేవీలను నిర్వహించేలా బ్యాంకులు ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు నెలకు 4 నగదు లావాదేవీలను మాత్రమే అనుమతిస్తుంది. అంతకు మించి చేస్తే లావాదేవీకి రూ.150 చొప్పున ఛార్జ్‌ చేస్తుంది. నగదు లావాదేవీల మొత్తంపైనా పరిమితి ఉంది. ఈ పరిమితి హోమ్‌ బ్రాంచీలో అయితే రూ.2 లక్షలు, ఇతర బ్రాంచీల్లో అయితే రూ.25 వేల వరకు ఉంది. అంతకు మించి లావాదేవీలు చేస్తే ప్రతి రూ.1000కు రూ.5 చొప్పున ఛార్జీలు (కనీస ఛార్జీ రూ.150) విధిస్తుంది.

డెబిట్‌ కార్డు ఫీజు..

సాధారణంగా పొదుపు ఖాతాతో చాలా బ్యాంకులు డెబిట్‌ కార్డును ఉచితంగానే ఇస్తాయి. అయితే, కొన్ని బ్యాంకులు ప్రీమియం డెబిట్‌ కార్డులను అందిస్తున్నాయి. వీటి జారీకి కొంత మొత్తం ఛార్జ్‌ చేస్తాయి. అలాగే, వార్షిక రుసుములు ఉండొచ్చు. మీ డెబిట్‌ కార్డుతో ఎంత ఎక్కువ ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తుంటే, అంత ఎక్కువగా ఫీజులను ఛార్జ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు డెబిట్‌ కార్డును పోగొట్టకుంటే రీప్లేస్‌మెంట్‌ కోసం కూడా కొంత మొత్తాన్ని ఛార్జ్‌ చేస్తారు. ఉదాహరణకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫ్లాటినమ్‌ డెబిట్‌ కార్డు జారీకి రూ.300+జీఎస్‌టీ, వార్షిక నిర్వహణ కింద రూ.250+జీఎస్‌టీ వసూలు చేస్తుంది. అలాగే డెబిట్‌ కార్డు రీప్లేస్‌మెంట్‌ కోసం రూ. 300+జీఎస్‌టీ, బ్రాంచి ద్వారా పిన్‌ జనరేషన్‌, డూప్లికేట్‌ పిన్‌ కోసం రూ.50+జీఎస్‌టీ ఛార్జీ చేస్తుంది.

నగదు బదిలీపై ఛార్జీలు..

ఐఎంపీఎస్‌ (IMPS), నెఫ్ట్‌ (NEFT), ఆర్‌టీజీఎస్‌ (RTGS) వంటి  విధానాల ద్వారా బ్యాంకు బ్రాంచి నుంచి నగదు బదిలీ సేవలను పొందేందుకు ఛార్జీలు వర్తిస్తాయి. ఇవి వేరు వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటాయి. నెఫ్ట్‌ ఛార్జీలు రూ.1-25+ జీఎస్‌టీ, ఆర్‌టీజీఎస్‌ ఛార్జీలు రూ.5-50+జీఎస్‌టీ, ఐఎంపీఎస్‌ ఛార్జీలు రూ.1-15+జీఎస్‌టీ వరకు ఉండొచ్చు. నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎస్‌బీఐ నెఫ్ట్‌ లావాదేవీలపై రూ.2-20+జీఎస్‌టీ, ఆర్‌టీజీఎస్‌పై రూ. 20-40+జీఎస్‌టీ, ఐఎంపీఎస్‌పై రూ. 2-20+జీఎస్‌టీ (రూ.10 వేల లోపు లావాదేవీలు ఉచితం) వసూలు చేస్తుంది.

ఏటీఎం లావాదేవీ ఛార్జీలు..

సాధారణంగా బ్యాంకులు తమ సొంత ఏటీఎంలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 3 సార్లు ఉచిత లావాదేవీలను అనుమతిస్తాయి. ఈ పరిమితులను మించితే దాదాపు రూ.20-50 ఛార్జ్‌ చేస్తాయి. ఖాతాదారులు నివసించే ప్రాంతం, తీసుకున్న ఖాతా, నిర్వహంచే మినిమం బ్యాలెన్స్‌ ఆధారంగా ఉచిత లావాదేవీల పరిమితి పెరగొచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకును తీసుకంటే మెట్రో నగరాల్లోని పొదుపు ఖాతాదారులకు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలను అనుమతిస్తుంది. అయితే, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 లావాదేవీలను మాత్రమే అనుమతిస్తుంది. ఆ తర్వాత చేసే ఒక్కో నగదు లావాదేవీపై రూ.20+జీఎస్‌టీ, ఆర్థికేతర లావాదేవీల కోసం రూ. 8.50+జీఎస్‌టీ విధిస్తుంది.

డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌..

పన్ను ఫైలింగ్‌ కోసం బ్యాంకులు ఆర్థిక సంవత్సరంలో ఒకసారి స్టేట్‌మెంట్‌ కాపీని భౌతికంగా ఉచితంగానే అందిస్తాయి. ఒకవేళ మీరు డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ కోసం అభ్యర్థిస్తే బ్యాంకులు రూ.50 నుంచి రూ.100 వరకు ఛార్జ్‌ చేయవచ్చు. బ్యాంకు నిబంధనలను అనుసరించి ఒక్కో పేజీకి రూ.10 వరకు ఖర్చుకావచ్చు. స్టేట్‌మెంట్‌ను నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే తక్కువ ఛార్జ్‌ చేయవచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్‌ డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ కోసం బ్యాంకు ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.100, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.50 ఛార్జ్‌ చేస్తుంది.

చెక్‌బుక్‌..

బ్యాంకులు పొదుపు ఖాతాతో పాటు 10 చెక్‌లతో కూడిన చెక్‌బుక్‌ను ఉచితంగా ఇస్తాయి. ఆ తర్వాత తీసుకునే వాటిపై ఛార్జీలను విధిస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు శాలరీ ఖాతా, సీనియర్‌ సిటిజన్లకు ఉచితంగా అందిస్తున్నాయి.

ఈసీఎస్‌ లావాదేవీ విఫలమైతే..

మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేని కారణంగా మీ ఈసీఎస్‌ చెల్లింపు విఫలమైతే అదనపు పెనాల్టీ పడుతుంది. కొన్ని బ్యాంకులు విఫలం అయిన అన్ని లావాదేవీలకు ఒకే విధంగా ఛార్జ్‌ చేస్తుంటే, మరికొన్ని బ్యాంకులు విఫలం అయిన రెండో లావాదేవీకి మొదటి లావాదేవీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి.

ఇతర ఛార్జీలు..

ఇవి కాకుండా బ్యాంకులు చెక్‌బౌన్స్‌ (తగినంత బ్యాలెన్స్‌ లేని కారణంగా చెక్‌ తిరిగి రావడం), ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ ఛార్జీలు, ఖాతా మూసివేత (సాధారణంగా ఖాతా తెరిచిన సంవత్సరం లోపే మూసివేస్తే ఛార్జీలు వర్తిస్తాయి), అవుట్‌ స్టేషన్‌ చెక్‌ హ్యాండ్లింగ్ ఛార్జీలు, కొత్త చెక్ బుక్ జారీ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్‌లు వంటి వాటిపైనా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని