Fixed Deposit: బ్యాంక్‌ ఎఫ్‌డీ Vs పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్.. ఏది మేలు?

ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌లలో వడ్డీరేటు కాస్త అధికంగా ఉంటుంది. అదే పెట్టుబడి కాలపరిమితి విషయంలో నిర్దిష్టంగా ఉన్నట్లయితే మాత్రం బ్యాంక్‌ ఎఫ్‌డీలలో ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి.

Updated : 13 Apr 2023 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మదుపు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపే తొలి మార్గం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit). వీటిని అర్థం చేసుకోవడం చాలా సులభం. నష్టభయం తక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకొని డబ్బు పొందొచ్చు. ఇటీవల ఎఫ్‌డీల వడ్డీరేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్ల వంటి ఇతర మదుపు మార్గాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది మళ్లీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు చూస్తున్నారు.

అయితే, మదుపర్లు అధిక ప్రయోజనాన్ని పొందడానికి అనువైన ఎఫ్‌డీ (Fixed Deposit) స్కీమ్‌ను గుర్తించగలగాలి. మరోవైపు బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో పోస్టాఫీసులు సైతం తమ టైమ్‌ డిపాజిట్ల (Post office time deposit) రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లలో ఏది మేలో చూద్దాం..

వివిధ అంశాల ఆధారంగా పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లు (Post office time deposit), బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మధ్య వ్యత్యాసం ఏంటో అర్థం చేసుకుందాం. తద్వారా ఏది ఎంచుకుంటే అధిక ప్రయోజనం పొందే అవకాశం ఉందో తెలుస్తుంది.

సులభంగా మదుపు..

బ్యాంక్‌ ఎఫ్‌డీ (Fixed Deposit), పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌.. ఈ రెండింట్లోనూ మదుపు చేయడం చాలా సులభం. ఆన్‌లైన్‌లోనే మదుపును ప్రారంభించొచ్చు. అయితే, స్థానికంగా బ్యాంకు శాఖలు అందుబాటులో ఉన్నంతగా పోస్టాఫీస్‌ కార్యాలయాలు ఉండకపోవచ్చు. మనం నివసించే ప్రాంతానికి దగ్గర్లో ఉంటే అత్యవసర సమయాల్లో త్వరగా డిపాజిట్లను నగదు రూపంలోకి మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది.

పెట్టుబడికి భద్రత..

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ల (Post office time deposit)కు ప్రభుత్వ హామీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీటికి హామీదారు. అదే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు రూ.ఐదు లక్షల వరకు ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (DICGC)’ కింద బీమా రక్షణ లభిస్తుంది. కాబట్టి రెండింటిలోనూ మన పెట్టుబడికి భరోసా లభిస్తుంది.

కాలపరిమితి..

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ల (Post office time deposit)లో కనిష్ఠంగా ఒక సంవత్సరం.. గరిష్ఠంగా ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయొచ్చు. బ్యాంకు ఎఫ్‌డీల్లో అయితే కనిష్ఠంగా ఏడు రోజులు.. గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు డిపాజిట్‌ చేసే అవకాశం ఉంటుంది. కాలపరిమితి పరంగా చూస్తే బ్యాంకు ఎఫ్‌డీ (Fixed Deposit)ల్లో ఎక్కువ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

సీనియర్‌ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు..

చాలా వరకు బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు ఎక్కువ వడ్డీరేటును అందిస్తున్నాయి. సాధారణ పౌరులతో పోలిస్తే.. వారికి 0.5 నుంచి 0.75 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. అదే పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ల (Post office time deposit)లో అయితే అన్ని వయసుల వారికీ ఒకే రకమైన వడ్డీరేటు ఉంటుంది.

వడ్డీరేట్లు..

బ్యాంకులు వడ్డీరేట్లను ఆర్‌బీఐ రెపోరేటుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరిస్తాయి. పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లను మాత్రం ప్రతి మూడు నెలలకోసారి సవరించే అవకాశం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల ఎఫ్‌డీ (Fixed Deposit)రేట్లతో పోలిస్తే ప్రస్తుతం పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ల వడ్డీరేటు కొంత ఎక్కువగానే ఉంది. కానీ, కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు మాత్రం పోస్టాఫీస్‌ కంటే మెరుగైన వడ్డీరేటును ఇస్తున్నాయి.

సీనియర్ సిటిజన్ అయితే, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ (Post office time deposit)తో పోలిస్తే బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. అదే పెట్టుబడి కాలపరిమితి విషయంలో నిర్దిష్టంగా ఉన్నట్లయితే బ్యాంక్‌ ఎఫ్‌డీ (Fixed Deposit)లలో ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి. ఏదేమైనప్పటికీ.. బ్యాంక్ ఎఫ్‌డీ, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌.. ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్నా.. మీ ఆర్థిక లక్ష్యాలను ఒకసారి సమీక్షించుకొని నిర్ణయం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని