Bank of England: వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌

ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ సైతం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బాటనే అనుసరించింది. మరోమారు పావు శాతం మేర వడ్డీ రేటును పెంచింది.

Published : 23 Mar 2023 23:04 IST

లండన్‌: ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా బ్రిటన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (Bank of England) సైతం వడ్డీ రేట్లను (Interest rates) పెంచింది. పావు శాతం మేర వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. మున్ముందు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి మానిటరీ కమిటీలో ఏడుగురు అనుకూలంగా ఓటేయగా.. ఇద్దరు మాత్రం వ్యతిరేకించారు. తాజా పెంపుతో వడ్డీ రేట్లు 4.25 శాతానికి పెరిగింది. 2021 డిసెంబర్‌ నుంచి వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లు పెంచడం ఇది 11వ సారి.

మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం వడ్డీరేటును మరో 25 బేసిస్‌ పాయింట్లు (0.25%) బుధవారం పెంచింది. తద్వారా రుణ రేటు 4.75-5 శాతానికి పెరిగింది. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల వైఫల్యంతో పాటు ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభం కారణంగా ఏర్పడ్డ గడ్డు పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపునకు తాత్కాలికంగానైనా బ్రేక్‌ ఇవ్వొచ్చని విశ్లేషకులు భావించారు. అయితే, అమెరికా, ఇంగ్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకులు రేట్ల పెంపునకే మొగ్గు చూపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని