Bank of India: స్పెష‌ల్ ట‌ర్మ్ డిపాజిట్‌ను ఆఫ‌ర్ చేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా..!

444 రోజుల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై ( రూ. 2 కోట్ల కంటే త‌క్కువ)  బ్యాంకు వార్షికంగా 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అన్ని మెచ్యూరిటీ బ‌కెట్లో బ్యాంకు అందించే అత్య‌ధిక రేటు ఇదే.

Updated : 24 Jun 2022 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 444 రోజుల కాల‌ప‌రిమితితో కొత్త‌గా ట‌ర్మ్ డిపాజిట్‌ను గురువారం ప్రారంభించింది. దీనిపై 5.50 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్న‌ట్లు బ్యాంక్ ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు మ‌రో 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబ‌రు 7, 2022న 117వ వ్య‌వ‌స్థాప‌క దినోత్సవం జ‌రుపుకోనుంది. ఈ సంద‌ర్భంగా త‌మ క‌స్ట‌మ‌ర్ల కోసం ప్ర‌త్యేక ట‌ర్మ్ డిపాజిట్‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు బ్యాంకు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ ఆఫ‌ర్ బ్యాంక్ అన్ని శాఖ‌లు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, బీఓఐ మొబైల్ యాప్‌తో స‌హా.. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంల‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది ప‌రిమిత కాల ఆఫ‌ర్ మాత్ర‌మే.

అలాగే, బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాల‌ప‌రిమితులు గ‌ల డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం రూ.2 కోట్ల కంటే త‌క్కువ ఉన్న‌ టర్మ్ డిపాజిట్ల‌పై కొత్త వ‌డ్డీ రేట్లు జూన్ 23 నుంచి వ‌ర్తిస్తాయి. 444 రోజుల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై (రూ.2 కోట్ల కంటే త‌క్కువ) బ్యాంకు వార్షికంగా 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అన్ని మెచ్యూరిటీ వ్యవధుల్లో బ్యాంకు అందించే అత్య‌ధిక రేటు ఇదే. 445 రోజుల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్ల‌పై 5.40 శాతం; 3 ఏళ్ల‌పైనా, 10 ఏళ్ల లోపు డిపాజిట్ల‌పై 5.35 శాతం వార్షిక వ‌డ్డీ రేటును అందిస్తుంది. ఇక 444 రోజుల కంటే త‌క్కువ ఉన్న డిపాజిట్లు, అంటే ఏడాది నుంచి 443 రోజుల లోపు డిపాజిట్ల‌ను 5.30 శాతం; 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌ను 4.35 శాతం వ‌డ్డీ రేట్ల‌తో ఆఫ‌ర్ చేస్తుంది. క‌నీస డిపాజిట్ మొత్తం రూ. 1 ల‌క్ష‌. 

రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 50 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. మూడేళ్లు, అంత‌కంటే ఎక్కువ కాల‌వ్య‌వధి గ‌ల డిపాజిట్ల‌పై మ‌రో 25 బేసిస్ పాయింట్లు అధిక వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది. అంటే, మూడేళ్లు అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్ల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్లకు 75 బేసిస్ పాయింట్ల మేర‌ అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఆఫ‌ర్ చేస్తున్న‌ తాజా వ‌డ్డీ రేట్లు..

  • 7 రోజుల నుంచి 45 రోజులు -  2.85%
  • 46 రోజుల నుంచి 179 రోజులు - 3.85%
  • 180 రోజుల నుంచి ఏడాది లోపు - 4.35%
  • ఏడాది నుంచి 443 రోజులు - 5.30%
  • 444 రోజులు - 5.50%
  • 445 రోజుల నుంచి 3 సంవ‌త్స‌రాల లోపు - 5.4%
  • 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు - 5.35%
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని