Locker: బ్యాంక్‌ లాకర్లలో క్యాష్‌ పెట్టొచ్చా? బ్యాంక్‌ నిబంధనలు ఏం చెప్తున్నాయ్‌?

Cash in locker: విలువైన వస్తువులను భద్రపరచడానికి లాకర్లు ఉపయోగిస్తాం. ఇంతకీ బ్యాంక్‌ లాకర్లలో నగదు పెట్టొచ్చా? బ్యాంక్‌ నిబంధనలు ఏం చెప్తున్నాయ్‌?

Published : 01 Oct 2023 01:47 IST

Locker rules | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఇటీవల ఓ సంఘటన చోటు చేసుకుంది. కుమార్తె పెళ్లి కోసమని ఓ మహిళ రూ.18 లక్షల మొత్తాన్ని బ్యాంక్‌ లాకర్లలో పెట్టారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత వెళ్లి చూస్తే ఆ మొత్తం చెద పురుగులు తినేశాయి. ఇ- కేవైసీ కోసం బ్యాంక్‌ అధికారులు ఆమెను పిలవడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము పోవడంతో భోరుమనడం ఆమె వంతైంది. ఈ ఘటన లాకర్‌ నిబంధనల (Locker rules) పట్ల అవగాహనలేమిని తెలియజేస్తోంది. ఇంతకీ బ్యాంక్‌ లాకర్లలో నగదు పెట్టొచ్చా? బ్యాంక్‌ నిబంధనలు ఏం చెప్తున్నాయ్‌?

సాధారణంగా విలువైన వస్తువులను భద్ర పరుచుకోవడానికి బ్యాంక్‌ లాకర్లను చాలా మంది వినియోగిస్తుంటారు. ఇంట్లో ఉంటే పోతాయన్న ఉద్దేశంతో విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరుస్తుంటారు. కానీ, నగదును బ్యాంక్‌ లాకర్లలో పెట్టడానికి అనుమతి లేదు. నగలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను మాత్రమే భద్రపరుచుకోవడానికి వీలుంటుంది. కరెన్సీని భద్రపరుచుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. ఒకవేళ అలాంటి వస్తువులను భద్రపరిచినా వాటి నష్టానికి బ్యాంకులు ఎలాంటి బాధ్యతా వహించవు.

అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్‌లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!

వీటికి అనుమతి లేదు..

బ్యాంక్‌ లాకర్లలో బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు, ఒప్పంద పత్రాలు వంటివి దాచుకోవచ్చు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ వంటివి భద్రపరచడానికి వీల్లేదు. అలాగే, ఏదైనా పాడైపోయే గుణం ఉన్న వాటిని, రేడియోధార్మిక పదార్థాలు, అక్రమ పదార్థాలను స్టోర్‌ చేయడానికి వీల్లేదు. బ్యాంక్‌కు గానీ, బ్యాంక్‌ కస్టమర్లకు గానీ ముప్పు, ప్రమాదం కలిగించే ఎటువంటి పదార్థాలను లాకర్లలో భద్రపరచడానికి బ్యాంకు నిబంధనలు అంగీకరించవు.

ఒకవేళ పోతే..?

లాకర్లలో భద్రపరచడానికి అనుమతి ఉండి, ఏదైనా కారణంతో వాటికి నష్టం వాటిల్లితే బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అగ్ని ప్రమాదాలు, దొంగతనం, ఉద్యోగులు ఎవరైనా మోసానికి పాల్పడితే జరిగిన నష్టానికి బ్యాంకులదే బాధ్యత. విపత్తులు, భూకంపాలు, వరదలు వంటివి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బ్యాంకులు నష్టానికి బాధ్యత వహించవు. అయితే, అలాంటి సందర్భాల్లోనూ లాకర్లలో వస్తువులకు ముప్పూ వాటిల్లకుండా బ్యాంకులు జాగ్రత్త వహించాలి. ఒకవేళ కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల లాకర్లోని వస్తువులకు నష్టం వాటిల్లితే దానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత తీసుకోవు.

ఎంత చెల్లిస్తాయి.?

సవరించిన లాకర్‌ నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన వస్తువులకు నష్టం వాటిల్లితే డిపాజిట్‌ మొత్తానికి 100 రెట్లు ఖాతాదారుడికి చెల్లించాలి. ఉదాహరణకు లాకర్‌ అద్దె ఏడాదికి రూ.2000 చెల్లిస్తుంటే.. అంతకు 100 రెట్లు అంటే రూ.2 లక్షలు ఖాతాదారుడికి బ్యాంకులు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొత్త లాకర్‌ మార్గదర్శకాలను 2021లో ఆగస్టు 18న ఆర్‌బీఐ జారీ చేసింది. ఈ మార్గదర్శకాల అమలుకు 2023 డిసెంబర్‌ 31 వరకు బ్యాంకులకు గడువు ఇచ్చింది. ఒకవేళ 2022 డిసెంబర్‌ 31 కంటే ముందు బ్యాంకులతో మీరు లాకర్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుని ఉంటే మళ్లీ కొత్తగా అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు